YS Avinash Reddy: మూడో రోజు ముగిసిన అవినాశ్ రెడ్డి విచారణ, రేపటి విషయంపై రాత్రికి సమాచారమిస్తామన్న సీబీఐ
- వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణకు అవినాశ్
- ఆరు గంటల పాటు కడప ఎంపీని విచారించిన దర్యాఫ్తు సంస్థ
- హైకోర్టు ఆదేశాలపై నేడు స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు
- ఈ నెల 24 వరకు అరెస్ట్ చేయద్దన్న సుప్రీం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప లోక్ సభ సభ్యుడు, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ నేడు ముగిసింది. ఈ రోజు సీబీఐ ఆరు గంటల పాటు ఆయనను విచారణ జరిపింది. రేపు విచారణకు రావాలో వద్దో... రాత్రికి సమాచారం అందిస్తామని అవినాశ్ రెడ్డికి సీబీఐ తెలిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు అవినాశ్ రెడ్డి ఈ నెల 25వ తేదీ వరకు సీబీఐ ఎదుట హాజరు కావాల్సి ఉంది. విచారణ ఎన్ని రోజులు చేస్తారనేది సీబీఐ ఇష్టం.
కొన్ని రోజుల క్రితం వైఎస్ భాస్కరరెడ్డి అరెస్ట్ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి తనను కూడా అరెస్ట్ చేస్తారనే ఆందోళనతో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇరువైపుల వాదనలు విన్న జడ్జి ఈ నెల 25వ తేదీ వరకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించింది. అలాగే 25 వరకు సీబీఐ పిలిస్తే విచారణకు వెళ్లాలని చెప్పింది. ఈ కారణంగా మూడు రోజులుగా ఆయన విచారణకు హాజరవుతున్నారు. మరోపక్క, హైకోర్టు ఆదేశాలపై నేడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అయితే, ఈ నెల 24 వరకు అవినాశ్ ను అరెస్ట్ చేయద్దని ఆదేశించింది.