Bonda Uma: జగన్ తన లండన్ పర్యటన రద్దు చేసుకుంది అందుకే: బొండా ఉమ
- మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో బొండా ఉమ ప్రెస్ మీట్
- జగన్ తన మీడియాలో అక్కసు వెళ్లగక్కుతున్నాడని విమర్శలు
- వివేకా హత్య కేసు నిందితులను కాపాడుతోంది జగనే అని వెల్లడి
- సీబీఐ పట్టుకుంది చిన్న చేపలనే అని వివరణ
- అసలైన కిల్లర్ ఫిష్ లు ఇంకా దొరకలేదని వ్యాఖ్యలు
బాబాయ్ ని చంపినవారెవరో తెలిసిన జగన్, వారిని కాపాడడం కోసం తన అవినీతి మీడియాను నమ్ముకున్నాడని టీడీపీ సీనియర్ నేత, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ విమర్శించారు. లాబీయిస్టులు, ప్రముఖ లాయర్లు, పైరవీలతో ఉపయోగంలేకపోవడంతో, జగన్ తన అవినీతి మీడియాలో అక్కసు వెళ్లగక్కుతున్నాడని వెల్లడించారు.
మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో బొండా ఉమ మీడియా సమావేశం నిర్వహించారు. వివేకా హత్య కేసు విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉండటంతో అసలు దోషులు అల్లాడిపోతున్నారని తెలిపారు. నీతిమాలిన విష ప్రచారంతో ముఖ్యమంత్రి, అతని అవినీతి మీడియా దోషుల్ని కాపాడలేవని బొండా ఉమ స్పష్టం చేశారు. వివేకా హత్య కేసులో నిందితుల్ని కాపాడుతున్నది జగన్మోహన్ రెడ్డేనన్న ప్రజలకు తెలిసిన పచ్చినిజం... సాక్షి మీడియాకు తెలియదా? అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొమ్ముకాయడం, నిందితులకు అండగా ఉండటంవల్లే, హత్యకేసు విచారణ జాప్యం జరిగిందని అన్నారు. సీబీఐ దోషుల్ని శిక్షించడానికి ప్రయత్నిస్తుంటే, తన అన్నే అడ్డుకుంటున్నాడని వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి కోర్టుల్నిఆశ్రయించిందని, ఆమె చేస్తున్న అసమాన పోరాటం వల్లే తాడేపల్లి ప్యాలెస్ లో అలజడి మొదలైందని బొండా ఉమ తెలిపారు.
వివేకా హత్య కేసులో సీబీఐ విచారిస్తున్నది, ఇప్పటివరకు అదుపులోకి తీసుకుంది చిన్న చేపలనే అని, అసలైన కిల్లర్ ఫిష్ లు ఇంకా సీబీఐ వలకు చిక్కలేదని తెలిపారు వివేకా హత్య జరిగిన రాత్రి అవినాశ్ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి ఫోన్ చేసి ఏం మాట్లాడాడో తెలియాలని అన్నారు. అలానే భారతి రెడ్డి అటెండర్ కు ఫోన్ చేసి ఆమెతో ఏం మాట్లాడాడో తేల్చాలని స్పష్టం చేశారు.
“వివేకా హత్యకేసు నిందితుల్ని కాపాడటానికే జగన్ తన లండన్ పర్యటన రద్దు చేసుకున్నాడు. జగన్ లాబీయిస్ట్ ను రంగంలోకి దించడంవల్లే, అవినాశ్ రెడ్డి అరెస్ట్ కాలేదు. బాబాయ్ హత్యకేసులో నిందితుల్ని జగనే కాపాడుతున్నాడని చిన్నపిల్లలకు కూడా అర్థమైంది. కానీ జగన్ సొంతపత్రిక, అవినీతి పత్రిక సాక్షిలో మాత్రం ఇప్పటికీ పనికిమాలిన కథనాలు వండి వారుస్తున్నారు. ‘వివేకా హత్యకేసులో హంతకుల్ని నడిపిస్తున్నదెవరు’ అని సాక్షిలో అచ్చేసిన కథనానికి జవాబు జగన్మోహన్ రెడ్డే అనడంలో ఎలాంటి సంశయంలేదు" అని స్పష్టం చేశారు.
"2019 మార్చి 23న సాక్షి పత్రికలో నారాసుర రక్తచరిత్ర అని బ్యానర్ ఐటమ్ వేశారు. వివేకానందరెడ్డిని చంద్రబాబే చంపాడని నీతిమాలిన రాతలు రాసింది. ఈరోజున ‘వివేకాహత్యకేసులో హంతకుల్ని నడిపిస్తున్నదెవరు’ అంటూ దిగజారుడు రాతల కు తెరలేపింది" అని బొండా ఉమ మండిపడ్డారు.
"ఎన్నో హత్య కేసుల్ని దర్యాప్తు చేసిన సీబీఐ సంస్థే జగన్ తీరుకి నివ్వెరపోతోంది. వివేకా బతికుంటే తమకు రాజకీయ మనుగడ లేదని భావించే అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఆయన్ని లేపేయాలని నిర్ణయించుకున్నారు. కడప ఎంపీ టిక్కెట్ మన కుటుంబంలోని వారికే ఇవ్వాలని, అవినాశ్ రెడ్డికి ఇవ్వవద్దని వివేకా పట్టుబట్టడం కూడా అవినాశ్ రెడ్డిలో వివేకాపై ఆగ్రహావేశాలు రేకెత్తాయి" అని వివరించారు.