Mallikarjun Kharge: కర్ణాటకలో 150 సీట్లు గెలిస్తేనే కాంగ్రెస్ కు భవిష్యత్తు.. లేకపోతే బీజేపీ కబళించడం ఖాయం: ఖర్గే
- వచ్చే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు
- జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే
- తనపై దళితనేత ముద్ర సరికాదని వెల్లడి
- కష్టపడి పైకొచ్చానని స్పష్టీకరణ
మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు కాంగ్రెస్ పార్టీ నేషనల్ చీఫ్ అయ్యారు... దాంతో కర్ణాటకలో ఓ దళితుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారిందని భావించవచ్చా? అన్న ప్రశ్నకు స్పందించారు.
తనపై ఓ దళిత నేతగా ముద్ర వేయడం సరికాదని అన్నారు. "నా పనితీరు కారణంగానే నేను అంచెలంచెలుగా ఎదిగాను. ఏఐసీసీ అధ్యక్ష పదవిని నేనేమీ దళిత రిజర్వేషన్ కారణంగా పొందలేదు. సీఎం అవడం, పీఎం అవడం హైకమాండ్ నిర్ణయంపైనా, కొత్తగా ఎన్నికయ్యే అసెంబ్లీ లేక పార్లమెంటు నిర్ణయంపైనా ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని నేను చాలాసార్లు చెప్పాను. ప్రస్తుతం మా దృష్టంతా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది.
జాతీయ రాజకీయలకొస్తే.... లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా లౌకికవాద పార్టీలతో కూటమి ఏర్పాటు చేయడంపై ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని వివరించారు.
కర్ణాటక ఎన్నికల్లో 150 సీట్లు గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. ఆ సంఖ్యకు ఏమాత్రం తగ్గినా, ఆపరేషన్ లోటస్ ముప్పు తప్పదని వివరించారు. రాష్ట్రంలో బీజేపీ తమను విచ్ఛిన్నం చేయడం ఖాయమని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఏం జరిగిందో, కర్ణాటకలోనూ అదే జరుగుతుందని అన్నారు. బీజేపీ వద్ద పైసా (డబ్బు) ఉంది, పోలీస్ బలం ఉంది అని వ్యాఖ్యానించారు.