Revanth Reddy: భాగ్యలక్ష్మి గుడివద్ద ప్రమాణం చేద్దాం రా... ఈటలకు రేవంత్ సవాల్
- మునుగోడు ఉపఎన్నిక సమయంలో కాంగ్రెస్ కు కేసీఆర్ డబ్బు ఇచ్చారన్న ఈటల
- కాంగ్రెస్ కు రూ.25 కోట్లు ముట్టాయని ఆరోపణ
- కేసీఆర్ నుండి అణా పైస రాలేదని రేవంత్ రెడ్డి కౌంటర్
- ఏ గుడి వద్దకు రమ్మన్నా వచ్చి తడిబట్టలతో ప్రమాణం చేస్తానన్న కాంగ్రెస్ చీఫ్
- ఆరోపణలు నిరూపించాలని ఈటలకు 24 గంటల డెడ్ లైన్
హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ పైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గత ఏడాది జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు అంత ఖర్చు పెట్టే శక్తి లేదని, ఆ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి రూ.25 కోట్ల వరకు ముట్టాయని ఈటల సంచలన ఆరోపణలు చేశారు.
కేసీఆర్ నుండి కాంగ్రెస్ కు డబ్బులు ముట్టడం వల్లే వారు ఖర్చు పెట్టారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ బొమ్మా బొరుసు అన్నారు. ఈ తీవ్ర ఆరోపణల పైన రేవంత్ ఘాటుగా స్పందించారు. ఈటల వ్యాఖ్యలను ఖండించారు. అసలు, మునుగోడు ఉప ఎన్నిక కోసమే కాదు... కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా కేసీఆర్ నుండి అణా పైస ముట్టలేదన్నారు.
రూ.25 కోట్ల మేర కేసీఆర్ నుండి కాంగ్రెస్ కు ముట్టిందని ఈటల చెబుతున్నారని, కానీ అలాంటిది ఏమీ లేదని తాను రేపు భాగ్యలక్ష్మి గుడి వద్ద తడిబట్టలతో ప్రమాణం చేయడానికి సిద్ధమని చెప్పారు. ఒకవేళ ఆయన మరో గుడికి రమ్మన్నా తాను వెళ్లి, ప్రమాణం చేయడానికి సిద్ధమని చెప్పారు. తాను ఎలాంటి డబ్బులు తీసుకోలేదని దేవుడి పైన ఒట్టేసి చెబుతున్నా అన్నారు.
మునుగోడులో ప్రతి పైసా కాంగ్రెస్ పార్టీది... కార్యకర్తలదే అన్నారు. ఈటల తన వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలను అవమానిస్తున్నారన్నారు. తన ఆరోపణలను ఆయన 24 గంటల్లో నిరూపించాలని సవాల్ చేశారు. లేదంటే రేపు సాయంత్రం ఆరు గంటలకు భాగ్యలక్ష్మి గుడి వద్ద ప్రమాణానికి సిద్ధమన్నారు. ఈటల కూడా వచ్చి ప్రమాణం చేయాలన్నారు. రాజకీయాల కోసం ఈటల ఇలా మాట్లాడటం సరికాదన్నారు. దిగజారి మాట్లాడటం క్షమించరాని నేరమన్నారు.