ipl: జడేజా నుండి క్లాసెన్ కాపాడినా... ధోనీకి దొరికిపోయిన మయాంక్ అగర్వాల్
- జడేజా క్యాచ్ పట్టబోతుంటే అడ్డుగా వచ్చిన క్లాసెన్
- మయాంక్ అగర్వాల్ వికెట్ జస్ట్ మిస్, జడేజా సీరియస్ లుక్
- ఆ వెంటనే... ధోనీ కీపింగ్ టాలెంట్ కు మయాంక్ ఔట్
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవీంద్ర జడేజా, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ హెన్రిక్ క్లాసన్ మధ్య శుక్రవారం నాటి మ్యాచ్ లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మయాంక్ అగర్వాల్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టే ప్రయత్నం చేసిన జడేజాకు క్లాసన్ అడ్డుగా వచ్చాడు. దీంతో ఆ క్యాచ్ మిస్ అయింది. అయితే అదే ఓవర్ లో మరో బంతికి మయాంక్ అవుటయ్యాడు. దీంతో జడేజా ఆనందానికి అంతు లేకుండా పోయింది.
జడేజా 14వ ఓవర్ వేస్తున్నాడు. మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో క్లాసన్ నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్నాడు. ఈ ఓవర్ లో జడేజా వేసిన మొదటి బంతికి మయాంక్ షాట్ కొట్టాడు. ఇది నేరుగా దాదాపు జడేజా చేతుల్లోకి వచ్చింది. కానీ నాన్ స్ట్రైక్ లో ఉన్న క్లాసన్ ఈ క్యాచ్ ను అందుకునే సమయంలో అడ్డుగా వచ్చాడు. జడేజా కిందపడిపోవడంతో కొద్దిలో మయాంక్ అవుట్ నుండి తప్పించుకున్నాడు. క్యాచ్ మిస్ కావడంతో జడేజా... క్లాసెన్ వైపు కాస్త సీరియస్ గా చూశాడు.
అయితే, క్లాసెన్ ద్వారా వచ్చిన లైఫ్ ను మయాంక్ మాత్రం ఎక్కువ సేపు కాపాడుకోలేకపోయాడు. అదే ఓవర్ లో ఐదో బంతిని ఆడేందుకు ఫ్రంట్ ఫుట్ కు వచ్చాడు. ఆ బంతి మిస్ అయి వికెట్ కీపర్ ధోనీ చేతుల్లో పడింది. సీఎస్కే కెప్టెన్ చేతుల్లో పడితే ఇంకా ఏమైనా ఉంటుందా... క్షణం ఆలస్యం చేయకుండా స్టంపింగ్ చేశాడు. దీంతో మయాంక్ పెవిలియన్ దారి పట్టాడు. దీంతో జడేజా ఇప్పుడెలా ఉంది అన్న ధోరణిలో క్లాసెన్ వైపు మరోసారి లుక్ ఇచ్చాడు.
కాగా ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ 1 వికెట్ మాత్రమే కోల్పోయి 12 ఓవర్లలో 91 పరుగులు చేసింది. అనూహ్యం జరిగితే తప్ప చెన్నై విజయం దాదాపు ఖాయమైంది.