Sudan: సూడాన్‌లో చిక్కుకున్న 3 వేల మంది భారతీయులు.. అత్యవసరంగా తరలించాలని మోదీ ఆదేశం
- సూడాన్‌లో సైన్యం, పారామిలటరీ గ్రూపుల మధ్య భీకర కాల్పులు
- ప్రాణాలు కోల్పోతున్న వందలాదిమంది
- తమ దేశ పౌరులను వెనక్కి రప్పిస్తున్న అమెరికా, బ్రిటన్, జర్మనీ, స్పెయిన్ దేశాలు
- సూడన్ పరిస్థితిపై మోదీ అత్యున్నత స్థాయి సమావేశం
ఆఫ్రికా దేశం సూడాన్ అంతర్యుద్ధంతో రగిలిపోతోంది. దేశంపై పట్టుకోసం జరుగుతున్న ఈ పోరుతో వందలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారం రోజులుగా ఆ దేశ రెగ్యులర్ ఆర్మీ, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌గా పిలిచే పారామిలటరీ గ్రూప్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 413 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,551 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెండు గ్రూపుల మధ్య భీకర కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో దేశంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడ నివసిస్తున్న దాదాపు 3 వేల మంది భారతీయులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
సూడన్‌లో నెలకొన్న పరిస్థితులపై దృష్టి సారించిన భారత ప్రభుత్వం అక్కడ చిక్కుకున్న వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, జర్మనీ, స్పెయిన్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు సూడాన్‌లో చిక్కుకున్న తమ దేశ పౌరులను వెనక్కి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా చర్యలు చేపట్టింది.
సూడాన్ పరిస్థితిపై నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా, వేగంగా తరలించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ సమావేశానికి విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ (గయానా నుంచి హాజరయ్యారు), జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, సూడన్‌లో భారత రాయబారి బీఎస్ ముబారక్ హాజరయ్యారు.