IIT Madras: ఐఐటీ మద్రాస్‌లో మరో విద్యార్థి ఆత్మహత్య?
- సెకెండ్ ఇయర్ బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి
- సీలింగుకు వేలాడుతూ విద్యార్థి మృతదేహం
- ఆత్మహత్య చేసుకున్నట్టు యూనివర్సిటీ అనుమానం
- ఈ ఏడాదిలో ఇది నాలుగో ఆత్మహత్య ఘటన
ఐఐటీ మద్రాస్‌లో కెమికల్ ఇంజినీరింగ్ లో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని యూనివర్సిటీ వర్గాలు భావిస్తున్నాయి. విద్యార్థి మృతికి కారణాలేంటో ఇంకా తెలియరాలేదు. అతడు మరణించినట్టు ధ్రువీకరిస్తూ ఐఐటీ మద్రాస్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఏప్రిల్ 1న ఐఐటీ మద్రాస్‌లో పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన గదిలో అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతకుమునుపు, ఏపీకి చెందిన థర్డ్ ఇయర్ విద్యార్థి అదే క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిబ్రవరిలో కూడా మహారాష్ట్రకు చెందిన ఓ పీహెచ్‌డీ స్కాలర్ తన గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
తాజా ఘటనపై ఐఐటీ మద్రాస్ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది. ఒత్తిడిలో ఉన్న విద్యార్థులను గుర్తించి సాయం అందించేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నట్టు పేర్కొంది. ఈ కష్టసమయంలో విద్యార్థి తల్లిదండ్రుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలగనీయద్దని విజ్ఞప్తి చేసింది.