Software employee: ఏడాదికి అరకోటి పైనే జీతం.. అయినా జీవితం నిస్సారమే!
- సోషల్ మీడియాలో ఓ యువ టెకీ ఆవేదన.. సలహా కోసం అభ్యర్థన
- వైరల్ గా మారిన ట్వీట్.. తోడు వెతుక్కోమంటూ నెటిజన్ల సలహా
- మీలాగే చాలామంది ఇదే సమస్యతో బాధపడుతున్నారని కామెంట్లు
అలా చదువు పూర్తయిందో లేదో ఇలా ఉద్యోగం వచ్చింది.. మంచి కంపెనీలో భారీ ప్యాకేజీతో చేరిపోయా, ఉద్యోగ బాధ్యతలూ ఓకే.. నిండా పాతికేళ్లు లేవు అయినా జీవితం నిస్సారంగా మారింది. జీవితాన్ని ఆసక్తికరంగా మార్చుకోవడానికి మీకు తోచిన సలహాలు ఇవ్వండి ప్లీజ్.. అంటూ ఓ యువ టెకీ చేసిన విజ్ఞప్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పేరు చెప్పని ఈ టెకీ పెట్టిన పోస్టును సుఖదా అనే ట్విట్టర్ యూజర్ ‘ది అదర్ ఇండియా’ పేరుతో షేర్ చేశారు.
‘నా వయసు 24 ఏళ్లు. మూడేళ్లుగా ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నా. అనుకూలమైన పనివేళలు, ఏడాదికి రూ.58 లక్షల జీతం.. అయినా జీవితం సంతృప్తికరంగా లేదు. జీవితంలో ఏదో కోల్పోతున్న భావన, ఒంటరితనం వేధిస్తోంది. నాకు స్నేహితులే తప్ప గర్ల్ ఫ్రెండ్ లేదు. ఆ స్నేహితులు కూడా తమ తమ జీవితాలతో బిజీగా ఉన్నారు. కెరీర్ ప్రారంభం నుంచి ఒకే కంపెనీలో పనిచేయడమో లేక ఒకే పనిని చేస్తుండడమో.. కారణం ఏదైనా కావొచ్చు కానీ ఉద్యోగ బాధ్యతల్లో కొత్తదనంలేదు. దీంతో కెరీర్ లో ఎదుగుదలపై దృష్టి పెట్టలేదు. జీవితం నిస్సారంగా తయారైందనే ఫీలింగ్ ను వదిలించుకోవాలి. మరింత ఆసక్తికరమైన జీవితాన్ని పొందాలంటే ఏంచేయాలి? మీకు తోచిన సలహాలు ఇవ్వండి’ అంటూ ఓ యువ టెకీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. జీవితంలో డబ్బు మాత్రమే కాదు సంతోషం కూడా ముఖ్యమని చెప్పేందుకు ఇదే ఉదాహరణ అంటూ కొందరు, మీరు మాత్రమే కాదు.. ఈ సమస్యను చాలామంది ఎదుర్కొంటున్నారని కామెంట్లు పెడుతున్నారు. కొత్త స్టార్టప్ ను ప్రారంభించి కొత్త సవాళ్లను ఎదుర్కోవడం లేదా ఓ మంచి తోడును వెతుక్కోవడమే ఈ సమస్యకు పరిష్కారమని మరికొంతమంది నెటిజన్లు సూచిస్తున్నారు.