poonch attack: పూంచ్ ఉగ్రదాడి.. అమరుల కుటుంబాల పరిస్థితి దయనీయం

Poonch terrorist attack read the emotional story of the soldiers who were martyred

  • ఈ నెల 20న జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్ల వీరమరణం
  • ఐదుగురిలో నలుగురు పంజాబ్ వాసులే.. మరొకరిది ఒడిశా
  • కార్గిల్ యుద్ధంలో తండ్రి.. ఇప్పుడు కొడుకును కోల్పోయిన కుటుంబం
  • ఊహ తెలియని వయసులోనే తండ్రి ప్రేమకు దూరమైన చిన్నారులు

జమ్మూ కశ్మీర్ లోని పూంచ్ లో ఈ నెల 20న ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే! ఈ దాడిలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. దీంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఇంటిల్లిపాదికి ఆధారమైన కొడుకును కోల్పోయింది ఓ కుటుంబం.. నాలుగు నెలల పసికందు తండ్రి ప్రేమకు శాశ్వతంగా దూరమయ్యాడు. ఊహ తెలియని వయసులోనే తండ్రిని కోల్పోయిందో చిన్నారి.. ఇలా ఐదు కుటుంబాలలో తీరని శోకాన్ని మిగిల్చింది ఉగ్రవాదులు చేసిన దాడి! అమరవీరుల కుటుంబాల పరిస్థితి తెలిసిన వారంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ నెల 20న పూంచ్ జిల్లాలోని సాంగ్యోట్ కు వెళుతున్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. జవాన్ల వాహనంపై గ్రనేడ్ విసిరారు. దీంతో మంటలు చెలరేగి ఐదుగురు జవాన్లు మరణించారు. మరో జవాను ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

దాడిలో చనిపోయిన సైనికులు..

మన్‌దీప్ సింగ్- హవల్దార్:
పంజాబ్ కు చెందిన మన్‌దీప్ సింగ్ సెలవుపై మార్చిలో ఇంటికెళ్లాడు. భార్యాబిడ్డలు, తల్లితో నెల రోజులు గడిపి తిరిగి విధుల్లో చేరాడు. మన్ దీప్ తల్లి వృద్ధురాలు, భార్య, ఇద్దరు పిల్లలకు ఆయనే ఆధారం. ఉగ్రదాడిలో మన్ దీప్ అమరుడు కావడంతో కుటుంబంలో రోదనలు మిన్నంటాయి.

కుల్వంత్ సింగ్- లాన్స్ నాయక్:
పంజాబ్ లోని మోగా జిల్లా చారిక్ గ్రామం లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్ సొంతూరు. కుల్వంత్ కు నాలుగు నెలల పసికందుతో పాటు ఏడాదిన్నర వయసున్న పాప ఉంది. ఆయన తండ్రి కూడా సైన్యంలో సేవలందిస్తూ కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందాడు. రెండేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన కుల్వంత్.. ఇప్పుడు తన పిల్లలకు ఊహ తెలియక ముందే శాశ్వతంగా దూరమయ్యాడు.

హరికిషన్ సింగ్- సిపాయి :
పంజాబ్‌లోని బటాలాకు చెందిన సిపాయి హరికిషన్ సింగ్ వయస్సు 27 సంవత్సరాలు. ఆరేళ్ల క్రితం సైన్యంలో చేరాడు. హరికిషన్ కు తల్లిదండ్రులు, భార్య, మూడేళ్ల కూతురు ఉన్నారు. ఉగ్రదాడికి ఒకరోజు ముందు వీడియో కాల్ లో తమతో మాట్లాడాడని హరికిషన్ కుటుంబ సభ్యులు తెలిపారు. అదే చివరి చూపు అయిందని రోధిస్తున్నారు.

సేవక్ సింగ్- సిపాయి: 
భటిండాకు చెందిన సిపాయి సేవక్ సింగ్. తల్లిదండ్రులకు ఇద్దరు కూతుళ్ల తర్వాత పుట్టిన మగ సంతానం. సేవక్ సింగ్ తోబుట్టువులలో ఒకరికి వివాహం జరిగింది. కుటుంబానికి ఆధారమైన కొడుకును ఉగ్రవాదులు పొట్టనబెట్టుకోవడంతో సేవక్ సింగ్ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలని సైన్యానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

దేవాశిష్ బిస్వాల్- లాన్స్ నాయక్: 
ఒడిశాలోని పూరీ జిల్లా ఖండాయత్ సాహికి చెందిన లాన్స్ నాయక్ దేవాశిష్ బిస్వాల్.. 2021లో బిస్వాల్ వివాహం కాగా ప్రస్తుతం ఏడు నెలల చిన్నారికి తండ్రి. కూతురుకు మూడు నెలల వయసు ఉన్నపుడు బిస్వాల్ గ్రామానికి వచ్చాడు. త్వరలోనే మళ్లీ వస్తానని చెప్పి వెళ్లాడని, ఇప్పుడు ఈ ఘోరం జరిగిందని బిస్వాల్ భార్య తెలిపారు.

  • Loading...

More Telugu News