Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి జగన్, ప్రశాంత్ కిశోర్, సజ్జల కుట్రే: అచ్చెన్నాయుడు, యనమల
- చంద్రబాబు పర్యటనలపై దాడులకు పాల్పడే అవకాశం ఉందని డీజీపీకి కూడా ఫిర్యాదు చేశామన్న టీడీపీ నేతలు
- పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం జగన్ కుట్రలో భాగమేనని విమర్శ
- జగన్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందని ఎద్దేవా
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో నిన్న చంద్రబాబు వాహనంపై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి ముఖ్యమంత్రి జగన్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ప్రభుత్వ సలహాదారు సజ్జల కుట్ర అని ఆరోపించారు. కుట్రలో భాగంగానే దాడి జరిగిందని అన్నారు.
చంద్రబాబు పర్యటనలపై వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని, దాడులకు పాల్పడే అవకాశం ఉందని కడప ఎస్పీకి, ప్రకాశం ఎస్పీకి, పల్నాడు ఎస్పీకి, డీజీపీకి లేఖ ద్వారా రాతపూర్వకంగా తెలియజేశానని... అదే సమయంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కూడా ఫోన్లో డీజీపీకి ఫిర్యాదు చేశారని చెప్పారు. అయినా దాడి జరిగిందంటే అది ముమ్మాటికీ పోలీసులు, అధికార పార్టీ నేతలు కలిసి చేసిన కుట్రేనని.. ప్రతిపక్ష నేతకు భద్రత కల్పించడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం జగన్ రెడ్డి కుట్రలో భాగమేనని మండిపడ్డారు.
ఎన్ఎస్జీ కమాండోలపై కూడా రాళ్ల దాడికి దిగి, వారిని రెచ్చగొట్టి, దళితులపై కాల్పులు జరిపేలా చేసి, తద్వారా తెలుగుదేశం పార్టీపై బురద చల్లేందుకు కుట్ర చేశారని అచ్చెన్న అన్నారు. జగన్ రెడ్డి రోడ్డెక్కితే పరదాలు కట్టి, కందకాలు తవ్వి, రోడ్లపై బారికేడ్లు పెట్టి ప్రజల్ని కూడా రోడ్డెక్కనివ్వకుండా, ప్రతిపక్ష నేతల్ని గృహ నిర్బంధాలు చేసే పోలీసులు.. చంద్రబాబుపై రౌడీ మూకలు దాడి చేయడానికి వస్తుంటే అడ్డుకోకుండా వారికి అండగా నిలవడం వెనుక జగన్ రెడ్డి ఆదేశాలున్నాయని చెప్పారు. చంద్రబాబు కాన్వాయ్ ఎటు నుండి వస్తుందో మంత్రి ఆదిమూలపు సురేష్ పోలీసుల్ని కనుక్కుంటున్న తీరు చూస్తుంటే దాడికి ముందుగానే ప్లాన్ చేసుకున్నారని అర్థమవుతోందని అన్నారు.