viveka murder case: వివేకా హత్య కేసులో మరో సంచలనం.. వెలుగులోకి దస్తగిరి మొదటి స్టేట్ మెంట్!
- అప్రూవర్ గా మారకముందు సీబీఐకి స్టేట్ మెంట్ ఇచ్చిన దస్తగిరి
- బెంగళూరు ల్యాండ్ సెటిల్ మెంటే హత్యకు కారణమని అందులో వెల్లడి
- డబ్బుల్లో వివేకాను 50 శాతం వాటా అడిగిన ఎర్ర గంగిరెడ్డి
- నన్నే వాటా అడిగేంత గొప్పోడివయ్యావా అంటూ మండిపడ్డ వివేకా
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్యకు సంబంధించి సీబీఐకి దస్తగిరి ఇచ్చిన తొలి స్టేట్ మెంట్ తాజాగా బయటకు వచ్చింది. ఇందులో దస్తగిరి పేర్కొన్న విషయాలకు, ప్రస్తుతం కస్టడీలో ఇచ్చిన స్టేట్ మెంట్ లోని వివరాలకు చాలా తేడాలు ఉన్నాయని తెలుస్తోంది. వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే. అప్రూవర్ గా మారక ముందు దస్తగిరి సీబీఐకి ఇచ్చిన స్టేట్ మెంట్ లో పలు కీలక విషయాలను వెల్లడించాడు. వివేకానంద రెడ్డితో తనకు 2016 నుంచే పరిచయం ఉందని దస్తగిరి చెప్పాడు. 2017 ఫిబ్రవరి నుంచి 2018 డిసెంబర్ వరకు ఆయనకు డ్రైవర్‌గా పనిచేసినట్లు తెలిపాడు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడిపోవడంతో దానికి కారణమైన వారితో పాటు తనను కూడా వివేకా దారుణంగా తిట్టారని దస్తగిరి చెప్పాడు. అనంతరం కడపకు చెందిన రాధాకృష్ణమూర్తి, అతని కుమారుడు ప్రసాదమూర్తి మధ్య భూవివాదానికి సంబంధించిన సెటిల్ మెంట్ గురించి 2017 నుంచి 2018 వరకు బెంగళూరులో తిరిగామని చెప్పాడు. ఆ సెటిల్ మెంట్ తర్వాత వివేకాకు రూ.8 కోట్లు వస్తాయనే విషయం తమకు తెలుసన్నాడు. అలాగే 2018లో వివేకానంద రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి బెంగళూరు వెళ్లారని దస్తగిరి తన స్టేట్మెంట్లో తెలిపాడు.
ల్యాండ్ సెటిల్ మెంట్ లో వచ్చిన రూ.8 కోట్లలో 50శాతం వాటా ఇవ్వాలని ఎర్ర గంగిరెడ్డి అడగడంతో వివేకా మండిపడ్డారని దస్తగిరి చెప్పాడు. దీంతో ‘నన్నే వాటా అడిగేంత పెద్దోడివి అయ్యావా ?’ అంటూ గంగిరెడ్డిని వివేకా ప్రశ్నించారని అన్నాడు. ఆ రోజు నుంచి వివేకా, గంగిరెడ్డి మధ్య మాటలు బంద్ అయ్యాయని చెప్పాడు. ఈ క్రమంలోనే 2019 ఫిబ్రవరిలో ఎర్ర గంగిరెడ్డి పిలవడంతో తాను పులివెందులకు వెళ్లి ఆయనను కలిసినట్లు దస్తగిరి చెప్పాడు. వివేకాను చంపాలని చెప్పగా తాను ముందు ఒప్పుకోలేదని వివరించాడు. అయితే, లైఫ్ సెటిల్ అయ్యేంత పెద్ద మొత్తం ఇస్తామని, ఈ పథకం వెనక చాలా మంది పెద్దవాళ్లు ఉన్నారని ఎర్ర గంగి రెడ్డి తనతో చెప్పినట్లు తెలిపాడు. పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని ఆశ చూపడంతో వివేకాను హత్య చేసేందుకు ఒప్పుకున్నట్లు దస్తగిరి ఈ స్టేట్ మెంట్ లో పేర్కొన్నాడు.
దస్తగిరి మొదట ఇచ్చిన స్టేట్ మెంట్ ను పరిగణలోకి తీసుకోవాలి: ఎంపీ అవినాశ్ రెడ్డి
వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి మొత్తం 3 స్టేట్ మెంట్లు ఇచ్చాడని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తెలిపారు. అప్రూవర్ గా మారకముందు ఇచ్చిన స్టేట్ మెంట్ తో పాటు సీబీఐ అధికారులకు రెండు స్టేట్ మెంట్లు ఇచ్చాడని చెప్పారు. సీబీఐ కేవలం రెండో స్టేట్ మెంట్ ఆధారంగానే దర్యాప్తు జరుపుతోందని, మొదట ఇచ్చిన స్టేట్ మెంట్ ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అవినాశ్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.