Amit Shah: కర్ణాటకలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎందుకు టికెట్లు ఇవ్వట్లేదు?... అంటే, అమిత్ షా జవాబు ఇదే!

 Amit Shah responds on the question that Why does BJP drop sitting MLAs during elections
  • బీజేపీ ఎల్లప్పుడూ మార్పునే నమ్ముతుందన్న అమిత్ షా
  • కాంగ్రెస్‌లో చేరింది జగదీశ్ శెట్టార్ మాత్రమేనని, ఓటు బ్యాంకు, కార్యకర్తలు కాదని వ్యాఖ్య
  • భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా 
  • మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. ఇప్పటికే ముగిసిన నామినేషన్ల పర్వం
మరో 20 రోజుల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తయింది. అయితే చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీజేపీ సీట్లు ఇవ్వలేదు. పలువురు మంత్రులను కూడా పక్కన పెట్టింది. ఈ వ్యవహారంపై కన్నడ రాజకీయాల్లో దుమారమే రేపింది. మాజీ సీఎం, మాజీ డిప్యూటీ సీఎం సహా పలువురు నేతలు బీజేపీ నుంచి బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 

ఈ నేపథ్యంలో ఈ వివాదంపై బీజేపీ కీలక నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఎల్లప్పుడూ మార్పును నమ్ముతుందని చెప్పారు.

‘‘మాజీ సీఎం జగదీశ్ శెట్టార్ చేరడం వల్ల ఎన్నికల్లో గెలుస్తామని ఒకవేళ కాంగ్రెస్ భావిస్తే.. ఒంటరిగా గెలవలేమనే విషయాన్ని వాళ్లు అంగీకరిస్తున్నట్లే లెక్క. కాంగ్రెస్‌లో చేరింది కేవలం శెట్టార్ మాత్రమే. మా ఓటు బ్యాంకు, మా పార్టీ కార్యకర్తలు కాదు. బీజేపీ చెక్కుచెదరలేదు. మేం భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తాం’’ అని ధీమా వ్యక్తం చేశారు. 

ఆయా నేతలకు పార్టీ టిక్కెట్లు నిరాకరించడం వెనుక గల కారణాన్ని ప్రశ్నించగా.. ‘‘పార్టీ చాలా అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటుంది. వారు కళంకితులేమీ కాదు. పార్టీ నాయకులందరూ గౌరవనీయులే. టికెట్లు ఎందుకు ఇవ్వడం లేదనే విషయంపై మేం వారితో మాట్లాడాం’’ అని వివరించారు.

కొత్త రక్తం, మారిన జనరేషన్ ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. ‘‘వీరేంద్ర పాటిల్‌ను ఎయిర్‌పోర్ట్‌లోనే తొలగించిన రాజీవ్ గాంధీ మాదిరి కాదు మేము. వీరు పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన కార్యకర్తలు. అందుకే మేం వారితో మాట్లాడాం’’ అని వివరించారు.
Amit Shah
Karnataka
Assembly Elections
Jagadish Settar
BJP
Congress

More Telugu News