DK Aruna: ఓటుకు నోటు కేసులో నీ ప్రమేయం లేదని ప్రమాణం చేస్తావా?: రేవంత్ కు డీకే అరుణ కౌంటర్
- కేసీఆర్ నుంచి కాంగ్రెస్ కు రూ.25 కోట్లు అందాయని ఈటల ఆరోపణలు
- చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేద్దామని ఈటలకు రేవంత్ సవాల్
- రేవంత్ రెడ్డి ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించిన డీకే అరుణ
- మునుగోడులో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ వంద శాతం ఆర్థిక సాయం చేసిందని ఆరోపణ
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కేసీఆర్ నుంచి కాంగ్రెస్ పార్టీకి రూ.25 కోట్లు అందాయని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. ఈటలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేద్దామంటూ ఈటలకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
ఈ క్రమంలో ఈటలకు మద్దతుగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. ఓటుకు నోటు కేసులో నీ ప్రమేయం లేదని ప్రమాణం చేస్తావా రేవంత్? అంటూ సవాల్ విసిరారు. తన ప్రమేయం లేకుంటే రేవంత్ రెడ్డి భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని ప్రశ్నించారు.
మునుగోడులో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ వంద శాతం ఆర్థిక సాయం చేసిందని డీకే అరుణ కూడా ఆరోపించారు. ఈటల రాజేందర్‌పై రేవంత్ చేసిన కామెంట్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ను విమర్శిస్తే.. బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందిస్తున్నారో చెప్పాలన్నారు.
‘‘ఎన్నికలకు ముందా? తర్వాతా? అనేది కాదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసేది పక్కా’’ అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఇష్టానుసారం మాట్లాడితే బీజేపీ చూస్తూ ఊరుకోబోదని డీకే అరుణ హెచ్చరించారు.