Ravindra Jadeja: నా ప్రయాణంలో ధోనీయే మొదటి MS కాదు... ఈ విషయం ధోనీకీ చెప్పా: జడేజా
- మహేంద్ర చౌహాన్ - మహేంద్ర సింగ్ ధోనీ మధ్య తన క్రికెట్ ప్రయాణం అన్న జడ్డూ
- ఫాస్ట్ బౌలర్ ను కావాలనుకుంటే కోచ్ అంత ఎత్తు లేవని చెప్పాడని వెల్లడి
- పిచ్ ను రోల్ చేయడం కష్టంగా భావించి, బౌలింగ్ వేసేవాడినన్న జడేజా
తన క్రికెట్ ప్రయాణంలో ధోనీయే మొదటి మహేంద్ర సింగ్ లేదా MS కాదని రవీంద్ర జడేజా అన్నాడు. ధోనీ కంటే ముందు తన జీవితంలో మొదటి మహేంద్ర తన చిన్ననాటి కోచ్, జామ్ నగర్ లోని మెంటార్ మహేంద్ర సింగ్ చౌహాన్ అని గుర్తు చేసుకున్నాడు. ఇదే విషయాన్ని తాను మహీ భాయ్ కి కూడా చెప్పానన్నాడు. తాను యువకుడిగా ఉన్నప్పుడు ఫాస్ట్ బౌలర్ కావాలని భావించానని, కోచ్ మాత్రం నువ్వు పేస్ బౌలింగ్ వేసేంత ఎత్తు లేవని, ఫాస్ట్ బౌలర్ గా మారడం కష్టమని చెప్పాడని తెలిపాడు.
తమ అకాడమీలో బ్యాటింగ్ చేయాలని ఎవరికైనా అనిపిస్తే వారే పిచ్ ను రోల్ చేయాలని, తాను అలా చేయడం కష్టంగా భావించి బౌలింగ్ వేసేవాడినని చెప్పాడు. తాను స్పిన్ వేయడం ప్రారంభించడం, బ్యాట్సుమెన్ కూడా త్వరగా అవుట్ కావడంతో తనకు ఆసక్తి పెరిగిందన్నాడు. ఇప్పుడు అక్కడ 300 నుండి 400 మంది చిన్నారులు ఉన్నారని, అందుకే అక్కడి అకాడమీలో ప్రాక్టీస్ చేయడం లేదన్నాడు. క్రికెటర్ గా తన ప్రయాణం తన కోచ్ మహేంద్ర సింగ్ చౌహాన్ వద్ద ప్రారంభమైందని, ఇప్పుడు ఎంఎంస్ ధోనీతో కొనసాగుతోందని చెప్పాడు.