Komatireddy Raj Gopal Reddy: కవిత-రేవంత్ రెడ్డి మధ్య చీకటి వ్యాపారాలు, జైలుకెళ్లడం ఖాయం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- రేవంత్ గత చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలుసునన్న బీజేపీ నేత
- భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద ప్రమాణం చేస్తానంటే ఎవరు నమ్ముతారని వ్యాఖ్య
- నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆరోపణలు చేస్తున్నాడన్న రాజగోపాల్
- పరువు నష్టం కేసులో రేవంత్ జైలుకు వెళ్తాడని హెచ్చరిక
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య చీకటి వ్యాపారాలు ఉన్నాయని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ గత చరిత్ర తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసునని అన్నారు. పబ్లిక్ లోనే రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అనే పేరు ఉందని వ్యాఖ్యానించారు. ఆయన వేల కోట్లు దోచుకున్నారని, ఇప్పుడు తాను భాగ్యలక్ష్మి దేవాలయం వద్దకు వచ్చి ప్రమాణం చేస్తానని చెబితే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు.
రేవంత్ తనను రాజకీయంగా ఎదుర్కోలేక తనపైన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ కూడా తన పైన చేసిన ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ చేశారు. లేదంటే నేను వేసే పరువు నష్టం కేసులో ఆయన జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. రేవంత్ పదవులను అడ్డు పెట్టుకొని వేల కోట్లు సంపాదించుకున్నాడని ఆరోపించారు. పీసీసీ అధ్యక్ష పదవిని కూడా కొనుక్కున్న వ్యక్తి అని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో అతను పట్టుబడింది వాస్తవం కాదా అని నిలదీశారు.
కాగా, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని ఈటల రాజేందర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై తాను ప్రమాణం చేయడానికి సిద్ధమని రేవంత్ ఈటలకు సవాల్ చేశారు. ఈ రోజు సాయంత్రం రేవంత్ భాగ్యలక్ష్మి దేవాలయానికి రానున్నారు.