Sudan: ఘర్షణలతో అట్టుడుకుతున్న సుడాన్ నుంచి భారతీయుల తరలింపు
- భారత్ సహా 12 దేశాలకు చెందిన 66 మంది పౌరుల తరలింపు
- సౌదీలోని జెడ్డాకు చేరుకున్న విదేశీయులకు అధికారుల ఘనస్వాగతం
- ట్విట్టర్లో వెల్లడించిన సౌదీ అరేబియా
మిలిటరీ దళాల మధ్య ఘర్షణల కారణంగా సుడాన్లో చిక్కుకుపోయిన కొందరు భారతీయులు తాజాగా సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. భారత్ సహా 12 దేశాలకు చెందిన మొత్తం 66 మందిని సౌదీ అరేబియా ప్రభుత్వం శనివారం జెడ్డాకు తరలించింది. ఈ మేరకు సౌదీ విదేశాంగ శాఖ ట్విట్టర్లో ఓ ప్రకటన విడుదల చేసింది.
సుడాన్ పోర్టు నుంచి బయలుదేరిన విదేశీయులు నౌకలో జెడ్డా నగరానికి చేరుకున్నారు. జెడ్డాలో అధికారులు వారికి పుష్ఫగుచ్ఛాలతో స్వాగతం పలికారు. రంజాన్‌ను పురస్కరించుకుని స్వీట్లు అందజేశారు. అంతకుమునుపు, భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్.. సౌదీ విదేశాంగ శాఖ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్‌తో భారతీయుల తరలింపుపై చర్చించారు.
సుడాన్ సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య కొన్ని రోజులుగా ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. సైన్యంలో పారామిలిటరీ దళాల విలీనంపై ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఘర్షణలు మొదలయ్యాయి.