simhachalam: అప్పన్న దర్శనానికి వచ్చిన భక్తుల ఇక్కట్లు
- సింహాచలంలో గంటల తరబడి క్యూలైన్లలో అవస్థలు
- ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ మంత్రులపై ఆగ్రహం
- భక్తుల రద్దీ నేపథ్యంలో అంతరాలయ దర్శనం రద్దు చేసిన అధికారులు
విశాఖపట్నం జిల్లా సింహాచలంలో అప్పన్నస్వామి చందనోత్సవం ఆదివారం వైభవోపేతంగా జరిగింది. స్వామిని నిజరూపంలో దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. తెల్లవారుజామునుంచే భక్తులు క్యూ లైన్లకు చేరుకున్నారు. ఉచిత దర్శనం, రూ.300 దర్శనం, రూ.1000, రూ.1500 ప్రత్యేక దర్శనాలతో పాటు వీఐపీ దర్శనానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, లక్షలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి రావడంతో గందరగోళం నెలకొంది. సామాన్య భక్తులను పట్టించుకోకుండా ప్రముఖులకు దర్శనం కల్పించారని, గంటల తరబడి క్యూ కదలడమే లేదని భక్తులు ఆరోపించారు. దేవాదాయ శాఖ అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
భక్తులను సముదాయించేందుకు వచ్చిన మంత్రులు బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణలకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు. చందనోత్సవ ఏర్పాట్లు సరిగా చేయలేదని మండిపడ్డారు. కనీసం తాగునీరు సౌకర్యం కూడా కల్పించలేదని విమర్శించారు. రూ.1500 ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసినా గంటల తరబడి క్యూలోనే ఉన్నామని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాగా, భక్తులు పోటెత్తడంతో అంతరాలయ దర్శనాలను అధికారులు రద్దు చేశారు. దీనిపైనా భక్తుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. రూ.1500 చెల్లించి టికెట్ తీసుకుంటే సాధారణ దర్శనం ఎలా కల్పిస్తారంటూ అధికారులను నిలదీస్తున్నారు. అయితే, రూ.300 దర్శనం, రూ.1000 దర్శనం లైన్లు సాఫీగానే సాగుతున్నాయని, రూ.1500 టికెట్ దర్శనంతో పాటు వీఐపీ దర్శనానికి సంబంధించిన లైన్లలోనే ఇబ్బంది కలుగుతోందని సమాచారం.