Karnataka: కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి అస్వస్థత
- తీరికలేని ప్రయాణాలతో తీవ్ర అలసటకు గురైన జేడీఎస్ నేత
- శనివారం రాత్రి మణిపూర్ ఆసుపత్రిలో చేరిక
- విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు
జనతాదళ్ (సెక్యూలర్) నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్. డి. కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి ఆయన బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్ లో చేరారు. తీరికలేని ప్రచార కార్యక్రమాల వల్ల కుమారస్వామి తీవ్ర అలసటతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు.
కొన్నిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రచారం, పార్టీ కార్యక్రమాలతో కుమారస్వామి ఇటీవల బిజీబిజీగా గడుపుతున్నారు. తీరికలేకుండా ప్రయాణాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎండలకు ఆయన అస్వస్థతకు గురయ్యారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
వైద్య పరీక్షల తర్వాత కుమారస్వామి పార్టీ కార్యకర్తలు, అనుచరులను ఉద్దేశించి మీడియా ముందు మాట్లాడారు. తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో మళ్లీ పాల్గొంటానని, వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. తన ఆరోగ్యం గురించి ఆందోళన పడవద్దని అభిమానులకు చెప్పారు.