BJP: రేవంత్ రెడ్డి కన్నీరు పెడతారని అనుకోలే: ఈటల రాజేందర్
- కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో కలిసిపోతుందని తెలియడంతోనే ఏడ్చారు..
- ఏం ఉద్యమం చేసి జైలుకెళ్లావని రేవంత్ ను ప్రశ్నించిన ఈటల
- ఆర్టీఐ దరఖాస్తుల కోసం ఏకంగా ఆఫీసునే తెరిచాడంటూ విమర్శ
- వేలకొద్ది దరఖాస్తులు పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిదని ఆరోపణ
- ఆ తర్వాత ఏంచేస్తారనేది ఆయనే తెలుసని ఎద్దేవా
తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రేవంత్ రెడ్డి ధీరుడిలా పోరాడతారని అనుకున్నా.. కానీ ఇలా కన్నీళ్లు పెడతారని అనుకోలేదంటూ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరుడనేవాడు కొట్లాటలోనే గెలుపో ఓటమో తేల్చుకుంటాడు తప్ప ఇలా కన్నీళ్లు పెట్టడని ఈటల చెప్పారు. ఈటల రాజేందర్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ శనివారం హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి ఆలయంలో రేవంత్ రెడ్డి ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ ఘటనపై ఈటల రాజేందర్ ఆదివారం స్పందించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఓవైపు కన్నీళ్లు పెడుతూనే రేవంత్ రెడ్డి సంస్కారహీనంగా మాట్లాడారని ఈటల మండిపడ్డారు. విద్యార్థి దశలోనే ఉద్యమాలు చేశానని ఈటల చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అప్పటి పాలక కమిటికీ వ్యతిరేకంగా ఉద్యమిస్తే.. తనతో పాటు మరికొందరిని రెండుసార్లు జైలులో పెట్టారని వివరించారు.
తెలంగాణ ఉద్యమంలో నిత్యం రోడ్లమీద మేం కొట్లాడుతున్నప్పుడు మీరు ఎక్కడున్నారంటూ రేవంత్ రెడ్డిని ఈటల ప్రశ్నించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పంచన చేరి, ఉద్యమానికి దూరంగా ఉన్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కరీంనగర్ లో నిర్వహించతలపెట్టిన సభలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి వస్తున్నారనే విషయం తెలిసి అడ్డుకుంటామని ఉద్యమకారులు హెచ్చరించారని గుర్తుచేశారు. అయితే, రేవంత్ రెడ్డి తన తుపాకీ చేతిలో పట్టుకుని ఎవడు వస్తాడో రమ్మని సవాల్ చేసిన విషయం తనకు ఇంకా గుర్తుందని ఈటల వివరించారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తమపై వందల కేసులు నమోదయ్యాయని, మహబూబ్ నగర్, కరీంనగర్ జైళ్లలో శిక్ష అనుభవించామని ఈటల రాజేందర్ తెలిపారు.
నేను జైలుకు పోయినా.. నేను జైలుకు పోయినా అంటున్నారు.. రేవంత్ రెడ్డి మీరు ఎందుకోసం జైలుకు పోయారని ఈటల ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో జైలుకు పోయారు, మరో కేసులో జైలుకు పోయుంటారు కానీ ప్రజల కోసం ఏనాడూ జైలుకు పోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండూ కూడా ఒకే నాణేనికి ఉన్న బొమ్మా బొరుసులాంటివని ఈటల చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్వయంగా బీఆర్ఎస్, టీఎంసీ పార్టీలతో చర్చలు జరుపుతామని, కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తామని చెప్పారన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడంలో, ఆందోళనలు చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకే వేదికపై పక్కపక్కన కూర్చుండడం దేనికి సంకేతమని ఈటల ప్రశ్నించారు.
పరువు నష్టం కేసులో ఇటీవల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు శిక్ష విధిస్తే.. ఆ పార్టీ కన్నా ఎక్కువగా బీఆర్ఎస్ శోకాలు పెట్టిందని ఈటల గుర్తుచేశారు. దేశానికి చీకటి రోజంటూ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటయ్యే సూచనలు స్పష్టంగా కనిపించడంతో తన ఆశలు అడియాశలు అవుతున్నాయనే బాధతో రేవంత్ రెడ్డి ఏడ్చి ఉంటారని ఈటల వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధినేతగా పార్టీని గెలిపించుకుని, ముఖ్యమంత్రి పదవి దక్కించుకుందామన్న కోరిక నెరవేరడంలేదని రేవంత్ రెడ్డి బాధపడుతున్నారని చెప్పారు.
ఆర్టీఏ దరఖాస్తులు పెట్టేందుకు రాష్ట్రంలో ఏకంగా ఓ ఆఫీసునే తెరిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి మాత్రమేనని ఈటల చెప్పారు. రాష్ట్రంలోని కాంట్రాక్టర్లు, బిల్డర్లు, రియల్ వ్యాపారులు చేపట్టే ప్రాజెక్టులపై ఆర్టీఏ దరఖాస్తులు వేస్తారని చెప్పారు. వేలాదిగా ఆర్టీఏ దరఖాస్తులు పెట్టారని, ఆ తర్వాత ఏం చేస్తారో మీకే తెలుసని రేవంత్ రెడ్డిపై ఈటల మండిపడ్డారు. పరోక్షంగా రేవంత్ రెడ్డిపై ఆరోపణలను ఈటల గుర్తుచేశారు. కేబీఆర్ పార్క్ దగ్గర కడుతున్న భవనానికి సంబంధించిన పనులను అడ్డుకుంటామని ప్రకటించిన రేవంత్ రెడ్డి.. ఇప్పటి వరకూ అక్కడికి వెళ్లలేదని ఈటల గుర్తుచేశారు. ఈ విషయంలో ఏంజరిగిందో ఆయనకే తెలుసని అన్నారు. మనం చేస్తున్న పనులను సమాజం చూడట్లేదని అనుకోవడం పొరపాటని ఈటల రాజేందర్ హితవు పలికారు.