RCB: తొలి బంతికే కోహ్లీ అవుట్... డుప్లెసిస్, మ్యాక్స్ వెల్ విధ్వంసం... కానీ!

RCB posts 189 for 9 against Rajasthan Royals

  • బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
  • మొదట బ్యాటింగ్ కు దిగి 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 రన్స్ చేసిన ఆర్సీబీ
  • మ్యాక్స్ వెల్ 77, డుప్లెసిస్ 62 పరుగులు
  • చివరి 5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 33 రన్స్ చేసిన ఆర్సీబీ 

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. 

ఇన్నింగ్స్ ఆరంభంలోనే బెంగళూరు జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి బంతికే విరాట్ కోహ్లీ అవుటయ్యాడు. ఎడమచేతివాటం బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఓ ఇన్ స్వింగింగ్ డెలివరీతో కోహ్లీని ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఆ తర్వాత షాబాజ్ అహ్మద్ ను కూడా బౌల్ట్ అవుట్ చేయడంతో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 

అయితే, మరో ఓపెనర్ ఫాప్ డుప్లెసిస్, మ్యాక్స్ వెల్ వీరవిహారం చేయడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. వీరిద్దరూ క్రీజులో ఉన్నంతసేపు బంతికి తిప్పలు తప్పలేదు. బౌలర్ ఎవరన్నది చూడకుండా బాదేశారు. 

డుప్లెసిస్ 39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 62 పరుగులు చేయగా... మ్యాక్స్ వెల్ 44 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 77 పరుగులు చేశాడు. డుప్లెసిస్ రనౌట్ కాగా, మ్యాక్స్ వెల్ రివర్స్ స్వీప్ కొట్టే యత్నంలో అశ్విన్ బౌలింగ్ లో హోల్డర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

అక్కడ్నించి, ఆర్సీబీ ఇన్నింగ్స్ డౌన్ అయింది. వరుసబెట్టి వికెట్లు పడ్డాయి. ఆఖరి 5 ఓవర్లలో బెంగళూరు జట్టు 33 పరుగులు చేసి 5 వికెట్లు చేజార్చుకుంది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో బౌల్ట్ 2, సందీప్ శర్మ 2, అశ్విన్ 1, చహల్ 1 వికెట్ తీశారు. 

ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ఫీల్డింగ్ మరో లెవల్ లో ఉంది. రాజస్థాన్ ఫీల్డర్లు ముగ్గురు బెంగళూరు బ్యాటర్లను రనౌట్ చేశారు.

  • Loading...

More Telugu News