Nara Lokesh: అక్కడుంది చంద్రబాబు కాబట్టి సరిపోయింది.. నేనుంటేనా...!: లోకేశ్
- ఆదోని నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
- బీసీ సామాజిక వర్గీయులతో సమావేశం
- యర్రగొండపాలెం ఘటనపై స్పందన
- వైసీపీ నేతలు ప్రతిదానికి షర్టులు విప్పుతున్నారని విమర్శలు
- జగన్ ను ఎందుకు ప్రశ్నించలేదని ఆదిమూలపు సురేశ్ ను నిలదీసిన వైనం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం 78వ రోజు పాదయాత్ర ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా పెద్దఎత్తున జనం రోడ్లపైకి వచ్చి లోకేశ్ కు ఘన స్వాగతం పలికారు. పెద్ద తుంబళంలో ఆయనకు కనీవినీ ఎరుగని రీతిలో అపూర్వ స్వాగతం లభించింది.
ఈ ఉదయం ఆదోని శివారు కడితోట క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. వికలాంగుడు దూదేకుల ఇస్మాయిల్ తన గోడు విన్పిస్తూ 3 ఎకరాల పొలం ఉంటే 30ఎకరాలు ఉందంటూ పెన్షన్ పీకేశారని ఆవేదన వ్యక్తంచేశారు. గణేకల్లు గ్రామస్తులు యువనేతను కలిసి తమ గ్రామంలో ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను యువనేత దృష్టికి తెచ్చారు. గణేకల్లు శివారులో సజ్జరైతును కలిసి ఆయన ఇబ్బందులను తెలుసుకున్నారు.
జాలిమంచి గ్రామస్తులు తమ గ్రామానికి తాగు,సాగునీటి సమస్య పరిష్కరానికి ఎల్ఎల్ సి కెనాల్ నుంచి ఎత్తిపోతల పథకం నిర్మించాలని కోరారు. కుప్పగల్ వద్ద మధ్యాహ్నం భోజన విరామ సమయంలో బీసీలతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడే న్యాయవాదులు యువనేతను కలిసి వినతిపత్రం సమర్పించారు. అధికారంలోకి వచ్చాక అందరికీ అండగా నిలుస్తామని చెప్పి లోకేశ్ ముందుకు సాగారు.
భోజన విరామానంతరం ప్రారంభమైన పాదయాత్ర పెదతుంబళం మీదుగా తుంబళం క్రాస్ వద్ద విడిది కేంద్రానికి చేరుకుంది.
కొండలు, గుట్టల్ని కనపడనీయవా క్యాష్ ప్రసాదూ?
పాదయాత్ర దారిలో ఓ గ్రావెల్ టిప్పర్ ను గమనించిన లోకేశ్ అక్కడ సెల్ఫీ దిగి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత మూడు రోజులుగా ఆదోని నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాష్ ప్రసాద్ అవినీతి చిట్టా నేను బయటపెడుతుంటే ఆయనేమో బూతుల పంచాంగం విన్పిస్తున్నాడని వెల్లడించారు.
"క్యాష్ ప్రసాద్ నేతృత్వంలో ఎర్రగట్టు కొండను తవ్వేసి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న దృశ్యమిది. రోజూ 50 టిప్పర్ల ఎర్రమట్టిని టిప్పర్ రూ.5వేల చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో కొండలు, గుట్టలు కన్పించకుండా చేస్తానని జగన్ రెడ్డి వద్ద ఏమైనా శపథం చేశారా ఎమ్మెల్యే గారూ?" అంటూ లోకేశ్ చురకలంటించారు.
ఈ షర్టులు విప్పడం ఏంటో!
వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు అయ్యింది షర్టు, ప్యాంటు విప్పి అంగప్రదర్శన చెయ్యడానికా అని లోకేశ్ దుయ్యబట్టారు. కుప్పగల్ విడిది కేంద్రం వద్ద బీసీ సామాజిక వర్గం ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ... దళితులకు జగన్ పీకింది, పొడిసింది ఏమిటి అని నేను అంటే ఫేక్ వీడియో తయారు చేశారు. అది పట్టుకొని ఆదిమూలపు సురేశ్ షర్టు విప్పి బాబు గారి కాన్వాయ్ పై రాళ్ళు వేశారు. అక్కడుంది చంద్రబాబు కాబట్టి సరిపోయింది... నేను ఉంటేనే సరైన ఫిట్టింగ్ ఉండేది అని వార్నింగ్ ఇచ్చారు.
"అయ్యా ఆదిమూలం గారు మీకు దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే దళితుల పై దమనకాండ చేస్తున్న జగన్ ని ఎందుకు ప్రశ్నించలేదు? డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ ఎంతో మందిని వైసీపీ నాయకులు చంపేస్తే సురేశ్ గారు ఎందుకు నోరు విప్పలేదు? విదేశీ విద్యకు అంబేద్కర్ గారి పేరు తొలగించి జగన్ పేరు పెట్టుకున్నప్పుడు సురేశ్ గారు ఎక్కడ ఉన్నారు? " అంటూ లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు.
టీడీపీతోనే బీసీలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు స్వర్ణయుగం తెస్తామని లోకేశ్ పేర్కొన్నారు. బీసీలకు పుట్టినిల్లు టీడీపీ అని,. బీసీలకు రాజకీయ, ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్చింది టీడీపీతోనే అని స్పష్టం చేశారు.
"ప్రజలు ఎప్పటికీ పేదరికం లో ఉండాలి అనేది జగన్ ఆలోచన. పేదరికం లేని రాష్ట్రం చూడాలి అనేది నా కోరిక. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది టీడీపీ. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించింది టీడీపీ. బీసీలని జగన్ నమ్మించి వెన్నుపోటు పొడిచారు. బీసీలకి 10 శాతం రిజర్వేషన్లు కట్ చేసి 16,500 మంది బీసీలను పదవులకి దూరం చేసాడు జగన్" అని మండిపడ్డారు.
బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
టీడీపీ హయాంలో ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందించామని లోకేశ్ వెల్లడించారు. ఆదరణ పథకం-2 ద్వారా టీడీపీ హయాంలో కొన్న పనిముట్లు బీసీలకు ఇవ్వకుండా వాటిని గోడౌన్స్ లో పడేసి తుప్పు పట్టేలా చేశారని ఆరోపించారు.
"బీసీ విద్యార్థులకు అమలు చేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీ విద్య, పీజీ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని జగన్ రద్దు చేశారు. టీడీపీ ప్రభుత్వం బీసీలపై 26 వేల అక్రమ కేసులు పెట్టి వేధించింది. అందుకే టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. న్యాయ పోరాటానికి కావాల్సిన ఆర్ధిక సహాయం కూడా ప్రభుత్వమే అందిస్తుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం. ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బీసీ కుల ధృవీకరణ పత్రాలను పంపుతాం" అని హామీ ఇచ్చారు.
సజ్జ రైతును కలిసిన లోకేశ్
ఆదోని నియోజకవర్గం గణేకల్లు శివారులో లోకేశ్ ఓ సజ్జ చేలో దిగి రైతు కష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు గోళ్ల నాగరాజు తమ గోడు విన్పిస్తూ, తనకు ఎకరన్నర పొలం ఉందని తెలిపాడు. నీటి సౌకర్యం లేకపోవడంతో ఆరుతడి పంటగా అర ఎకరంలో సజ్జ వేసి, మిగిలిన ఎకరం బీడు పెట్టానని తెలిపాడు.
"నా పొలంలో బోరు ఉంది కానీ ట్రాన్స్ ఫార్మర్ లేదు. కరెంటు ట్రాన్స్ ఫార్మర్ కోసం రూ.20 వేలు డీడీ కట్టి ఏడాది అయింది. ఎప్పుడు అడిగినా ఇంకా ఏడాది సమయం పడుతుందని చెబుతున్నారు. సుమారు 2 కిలోమీటర్ల నుంచి రూ.60 వేలు ఖర్చు పెట్టి వైరు లాక్కుని నీళ్ల కోసం అవస్థలు పడుతున్నాను. అసలే వ్యవసాయం అంతంతమాత్రంగా ఉంటే, కరెంటు కనెక్షన్ కోసం నానా అగచాట్లు పడాల్సి వస్తోంది" అని వాపోయాడు.
అందుకు లోకేశ్ స్పందిస్తూ... రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల పుణ్యమా అని వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు. మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు బిగించాలని చూస్తున్నాడని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ట్రాన్స్ ఫార్మర్ ఇప్పించే ఏర్పాటు చేస్తాం అని రైతు నాగరాజుకు భరోసా ఇచ్చారు.
*యువగళం పాదయాత్ర వివరాలు:*
*ఇప్పటి వరకు నడిచిన దూరం 1020 కి.మీ.*
*ఈరోజు నడిచిన దూరం 15.2 కి.మీ.*
*79వ రోజు (24-4-2023) యువగళం వివరాలు:*
*ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా):*
సాయంత్రం
4.00 – తుంబలం క్రాస్ వద్ద పంచాయితీరాజ్ ప్రతినిధులతో ముఖాముఖి సమావేశం.
6.30 – తుంబలం క్రాస్ విడిది కేంద్రంలో బస.