Ajinkya Rahane: ధోనీ చెప్పింది వింటే చాలు...: రహానే
- తాను ఇదే భావనతో ఆడుతున్నానన్న అజింక్య రహానే
- ఆడితేనే కదా ప్రతిభను ప్రదర్శించేందుకు వీలుంటుందని వ్యాఖ్య
- తనలోని పూర్తి ప్రతిభ ఇంకా బయటకు రాలేదన్న సీఎస్కే బ్యాటర్
అజింక్య రహానే (34) ఒకప్పుడు మంచి ఫామ్ లో ఉన్న టీమిండియా క్రికెటర్. తర్వాత ఫామ్ కోల్పోవడంతో అవకాశాలు దూరమయ్యాయి. గతేడాది కోల్ కతా జట్టు కోసం ఆడిన రహానేని ఆ ఫ్రాంచైజీ ఉంచుకోలేదు. అతడ్ని మినీ వేలానికి విడుదల చేసింది. దీంతో ఈ ఏడాది చెన్నై జట్టులోకి చేరి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. తన మాజీ జట్టుపై ఆదివారం కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో చెలరేగి ఆడాడు. కేవలం 29 బంతుల్లోనే 71 పరుగులు పిండేసి పెవిలియన్ చేరాడు. రహానేని కేవలం రూ.50 లక్షల బేస్ ధరకు చెన్నై జట్టు కొనుక్కుంది. ఇతర ఏ జట్టూ వద్దనుకున్నప్పుడు చెన్నై జట్టు అతడిలోని ప్రతిభను తెలుసుకుని సొంతం చేసుకోగా, అంతకుమించి రహానే దుమ్ము దులుపుతున్నాడు.
మ్యాచ్ అనంతరం రహానే మీడియాతో మాట్లాడాడు. ‘‘నా బ్యాటింగ్ ను ఎంతో ఎంజాయ్ చేశాను. కానీ, నాలోని అసలైన ప్రతిభ ఇంకా బయటకు రాలేదని భావిస్తున్నాను. నేను ఇదే ఫామ్ ను కొసాగించాలని అనుకుంటున్నాను’’ అని రహానే తెలిపాడు. తన ప్రతిభ తిరిగి ప్రజ్వరిల్లడం వెనుక ధోనీ భాయ్ పాత్ర ఉందని అంగీకరించాడు. ‘‘అంతిమంగా ఆడే అవకాశం నాకు లభించింది. ఏడాది, రెండేళ్ల క్రితం చూస్తే నాకు కనీసం ఆడేందుకు కూడా అవకాశం రాలేదు. అదే పనిగా ఆడే అవకాశం రానప్పుడు నేను ఆడగలనని, నా అమ్ముల పొదిలో అలాంటి షాట్లు ఉన్నాయని ఎలా చూపించగలను’’ అని రహానే పేర్కొన్నాడు.
‘‘ఎంఎస్ ధోనీ కింద ఆడడం అంటే గొప్పగా నేర్చుకోవడం. ధోనీ నాయకత్వంలో భారత్ కు ఆడాను. కానీ, ధోనీ నాయకత్వంలో సీఎస్కేకు ఆడడం మొదటిసారి. అతడు ఏది చెప్పినా నీవు వినాలి. నేను అదే భావనతో ఉన్నాను. వాస్తవికంగా ఉంటున్నాను. నా బ్యాటుని మాట్లాడనివ్వాలని అనుకుంటున్నాను. నేను మరొకరిని కాపీ కొట్టకుండా నా ఆటనే ఆడుతున్నాను. ఒకరి విధానానికి మద్దతుగా నిలవడం అవసరం’’ అని చెబుతూ, తనకు ధోనీ భాయ్ మద్దతుగా నిలుస్తున్నట్టు వివరించాడు.