Telangana: పెండింగ్ బిల్లులపై గవర్నర్ డాక్టర్ తమిళిసై కీలక నిర్ణయం
- డీఎంఈ పదవీ విమరణ వయసు పెంపు బిల్లుకు నో
- పురపాలక చట్ట సవరణ, ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులు పెండింగ్
- వాటిపై వివరణ కోరిన గవర్నర్
తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసి పంపించిన పెండింగ్ బిల్లులపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఎంఈ పదవీ విరమణ పెంపు బిల్లును తమిళిసై తిరస్కరించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), అడిషనల్ డైరెక్టర్, ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పదవీ విరమణను 61 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం చేసింది. కానీ, దీనికి తమిళిసై ఆమోదం తెలుపలేదు. అదే సమయంలో పురపాలక చట్ట సవరణ, ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుపై ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. ఈ రెండు బిల్లులను పెండింగ్లో పెట్టారు.
పురపాలక సంస్థల్లో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఇప్పటిదాకా మూడేళ్ళ గడువు ఉంది. ఆ గడువును నాలుగేళ్ళకు పెంచుతూ మున్సిపల్ చట్టంలో సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. కానీ, బిల్లు ఆమోదంపై నిర్ణయానికి మరిన్ని వివరాలు అవసరం ఉంటాయని గవర్నర్ చెప్పారు. రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలను నెలకొల్పడానికి తీసుకొచ్చిన బిల్లు విషయంలో కూడా వివరణ కావాలన్న గవర్నర్ తమిళిసై దాన్ని కూడా పెండింగ్ లో ఉంచారు.