Dhoni: నాకు వీడ్కోలు పలికేందుకు వచ్చారేమో.. రిటైర్ మెంట్ పై మరోసారి ధోనీ వ్యాఖ్యలు!
- చెన్నై, కోల్ కతా మ్యాచ్ కు భారీగా తరలివచ్చిన అభిమానులు
- పసుపుమయమైన ఈడెన్ గార్డెన్స్.. సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు చెప్పిన ధోనీ
- కెరీర్ చివరి దశలో ఉన్నానంటూ ఇటీవల వ్యాఖ్యానించిన మాజీ కెప్టెన్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి చాలా కాలమైంది. ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే ఈ సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే విషయమై ధోనీ వరుసగా సంకేతాలు ఇస్తున్నాడు. ఇదే తన చివరి ఐపీఎల్ అని పరోక్షంగా చెబుతున్నాడు.
మొన్న సన్‌రైజర్స్‌తో మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ.. తన కెరీర్ చివరి దశలో ఉన్నానంటూ ధోనీ వ్యాఖ్యానించాడు. తాజాగా కోల్‌కతాతో మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ.. ‘ఫేర్ వెల్’ వ్యాఖ్యలతో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ‘‘మమ్మల్ని సపోర్ట్ చేయడానికి భారీగా వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన చాలా మంది ప్రేక్షకులు.. తర్వాతి మ్యాచ్ కు మాత్రం కేకేఆర్ జెర్సీతో తప్పకుండా వస్తారు. ఈ మ్యాచ్ లో మాత్రం నాకు ఫేర్ వెల్ ఇచ్చేందుకు వచ్చినట్లు ఉంది. అభిమానులకు థ్యాంక్స్’’ అని వ్యాఖ్యానించాడు. తద్వారా తనకు ఈడెన్ గార్డెన్స్‌లో ఇదే చివరి మ్యాచ్ అని ధోనీ చెప్పకనే చెప్పాడు.
నిజానికి ఈ మ్యాచ్ కోల్ కతాలో జరిగినట్లుగా కనిపించలేదు.. ఎందుకంటే ఈడెన్ గార్డెన్స్ మొత్తం చెన్నై అభిమానులతో పసుపు మయం అయిపోయింది. అంతలా తరలివచ్చారు అభిమానులు. ధోనీ బ్యాటింగ్ చూసేందుకు ఆసక్తి కనబర్చారు. బ్యాటింగ్ లో జడేజా ముందుగా వచ్చి ఆడుతుంటే.. ‘జడేజా త్వరగా ఔట్ అయిపో.. ధోనీ వస్తాడు’.. ‘జడేజా నువ్వు తొలి బంతికే ఔటవ్వవా.. ప్లీజ్.. మేం మహీ బ్యాటింగ్ చూడాలని అనుకుంటున్నాం’ అని ప్లకార్డులు చూపెట్టారంటే ధోనీ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది. ఆ వెంటనే జడేజా ఔట్ కాగా.. 19.4వ ఓవర్లో ధోనీ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆ సమయంలో అభిమానులు స్టేడియాన్ని హోరెత్తించారు.
ఇక కోల్‌కతాతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ 186/8కే పరిమితమైంది. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటిదాకా ఏడు మ్యాచ్‌లు ఆడిన ధోనీ సేన ఐదింట్లో గెలుపొంది 10 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది.