hair color: తెల్ల జుట్టుకు కారణాన్ని కనుక్కొన్న పరిశోధకులు
- చర్మంలోని మెలనోసైట్స్ మూల కణాలది కీలక పాత్ర
- జుట్టు కుదుళ్ల మధ్య స్వేచ్ఛగా సంచిరిస్తున్నంత సేపు నల్లటి రంగు
- కదలకుండా చిక్కుకుపోతే జుట్టు రంగులో మార్పులు
- కణాలు స్వేచ్ఛగా తిరిగేలా చూడడమే పరిష్కారం అంటున్న శాస్త్రవేత్తలు
నల్లగా ఉండే జుట్టు ఎందుకు రంగును కోల్పోతుంది..? జీవితంలో చివరి వరకు అదే రంగులో ఉండొచ్చుగా..! చాలా మంది అనుకునే మాటలివి. జుట్టు రంగును కోల్పోవడానికి పోషకాల లోపం కారణమని గతంలో చెప్పగా వినే ఉంటారు. కానీ, అసలు వెంట్రుకలు రంగును కోల్పోవడం వెనుక కారణాన్ని తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. ఈ పరిశోధనా వివరాలు జర్నల్ నేచర్ లో ప్రచురితమయ్యాయి.
వయసు పెరిగే కొద్దీ వెంట్రుకల మూల కణాలు వాటి సామర్థ్యాన్ని కోల్పోతాయట. దాంతో అవి నల్ల రంగును కాపాడుకోలేవు. పరిశోధకులు మనుషుల చర్మ కణాలు, ఎలుకల చర్మ కణాలపై పరిశోధన చేశారు. చర్మంలో ఉండే మెలైనోసైట్స్ స్టెమ్ సెల్స్ పై దృష్టి పెట్టారు. ఈ అధ్యయనానికి న్యూయార్క్ యూనివర్సిటీ గ్రాస్ మ్యాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నేతృత్వం వహించింది.
జుట్టు కుదుళ్లలోని కంపార్ట్ మెంట్ల మధ్య చలించే సామర్థ్యం కొన్ని రకాల మూల కణాలకు ఉంటుంది. ఇలా కంపార్ట్ మెంట్ల మధ్య కణాలు స్వేచ్ఛగా సంచరిస్తున్నంత కాలం జుట్టు తన సహజ రంగును కలిగి ఉంటుంది. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ ఈ మూల కణాలు కంపార్ట్ మెంట్ల మధ్య చలించే సామర్థ్యం బలహీనపడి చిక్కుకుపోతాయి. దాంతో జుట్టు క్రమంగా తెల్ల రంగులోకి మారిపోతుంది. మెలనోసైట్స్ మూల కణాలు అనేవి ఎప్పటికప్పుడు పెద్ద సంఖ్యలో పునరుత్పత్తి అవుతుంటాయి.
జుట్టు సాధారణ వృద్ధి దశలో ఉన్నంత వరకు ఈ కణాలు కంపార్ట్ మెంట్ల మధ్య స్వేచ్ఛగా తిరుగుతాయి. అలా తిరగలేనప్పుడే సమస్య ఏర్పడుతుంది. చిక్కుకుపోయిన కణాలను తిరిగి చక్కగా కదిలేలా చేసినట్టయితే జుట్టు నెరిసిపోకుండా చూడొచ్చని ఈ పరిశోధన నిర్వహించిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కనుక ఈ దిశగా పరిశోధనలు జరగాల్సి ఉంది. ఆ విధమైన ఉపాయం కనిపిస్తే జుట్టు రంగు మారడానికి బ్రేక్ వేయవచ్చు.