UK: 25 ఏళ్లలోపు వయసున్న వారు ఫ్రెండ్స్ కు లిఫ్ట్ ఇవ్వకూడదట.. బ్రిటన్ లో రానున్న కొత్త నిబంధన
- కొత్త నిబంధనను తీసుకురావడంపై బ్రిటన్ లో కసరత్తు
- 25 ఏళ్లలోపు వయసున్న డ్రైవర్లతో పెరుగుతున్న ప్రమాదాలు
- ఒంటరిగా వెళ్లడం కంటే, లిఫ్ట్ ఇచ్చిన సమయాల్లోనే విషాదాలు
యూకే సర్కారు ఓ కొత్త నిబంధనను తీసుకురావాలని చూస్తోంది. 25 ఏళ్లలోపు వయసున్న వారు, తమ ఫ్రెండ్స్ కు కారులో లిఫ్ట్ ఇవ్వకుండా నిషేధించాలన్నదే ఈ ప్రతిపాదన. మే 6న జరిగే సమావేశంలో రవాణా మంత్రి రిచర్డ్ హోల్డెన్ ఈ నూతన ప్రతిపాదనను చర్చకు తీసుకురానున్నారు. అనంతరం గ్రాడ్యుయేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ పథకంలో భాగంగా నూతన నిబంధనను ప్రవేశపెట్టొచ్చని ద మిర్రర్ సంస్థ వెల్లడించింది.
నూతన నిబంధన ఎందుకని? అంటే.. కారు ప్రమాదాలను నివారించడమేనని తెలుస్తోంది. గ్రాడ్యుయేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష పాసై వాహనాలను నడపడం మొదలు పెట్టిన ఏడాది లోపే ప్రమాదాలకు గురవుతున్న కేసులు బ్రిటన్ లో పెరుగుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోందని తెలుసుకుందామని అక్కడ అధ్యయనం చేశారు. 25 ఏళ్లలోపు వయసున్న డ్రైవర్లు (వాహనదారులు/కారు నడిపేవారు) ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడంతో పోలిస్తే, ప్రయాణికులను ఎక్కించుకుని వెళుతున్న సమయాల్లో నాలుగు రెట్లు అధికంగా ప్రమాదాల బారిన పడుతున్నట్టు గుర్తించారు.
ఓ మహిళ తన 18 ఏళ్ల కుమార్తెను రోడ్డు ప్రమాదంలో కోల్పోయింది. ఆమె స్నేహితుడు కారులో లిఫ్ట్ ఇచ్చి తీసుకెళుతుండగా, ప్రమాదంలో బాలిక మరణించింది. దీంతో బాధిత బాలిక తల్లి దీనిపై ఉద్యమాన్ని నిర్వహించడంతో బ్రిటన్ సర్కారులోనూ చలనం వచ్చింది. ఇప్పటికే ఐర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్వీడన్, అమెరికాలో ఈ విధమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆల్కహాల్ ను పరిమితం చేయడం, రాత్రి వేళల్లో డ్రైవింగ్, ఇతర ప్రయాణికులతో కలసి వెళ్లడం వంటి వాటిపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రమాదాలను నివారించడమే ఈ నిబంధనల్లోని ఉద్దేశ్యంగా తెలుస్తోంది.