Delhi Metro: ప్రయాణం చేయండి.. ఇతరులకు మాత్రం ఇబ్బంది కలిగించకండి: ఢిల్లీ మెట్రో ప్రచారం
- మెట్రో రైలులో డ్యాన్సులు చేస్తున్న ప్రయాణికులకు అధికారుల సూచన
- తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయొద్దని వినతి
- ‘ట్రావెల్, డోన్ట్ ట్రబుల్’ పేరుతో డీఎంఆర్ సీ ప్రచారం
రద్దీగా ఉండే మెట్రో రైలులో వీడియోలు తీస్తూ, డ్యాన్సులు చేస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్ సీ) ఫన్నీగా రిక్వెస్ట్ చేసింది. ‘ట్రావెల్ డోన్ట్ ట్రబుల్’ పేరుతో ట్విట్ చేసింది. మెట్రోలో ప్రయాణం చేయండి.. తోటి వారికి తలనొప్పి తెచ్చిపెట్టొద్దని సూచించింది. ఒత్తిడి వల్ల తలలో ఏదో ఒక భాగంలో మాత్రమే నొప్పి వస్తుందని, మెట్రో రైలులో డ్యాన్స్ చేసే వారిని చూస్తే మొత్తం తలంతా నొప్పిలేస్తుందని ఫొటో ట్వీట్ చేసింది. డీఎంఆర్ సీ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
మెట్రో ప్రయాణంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఈ ట్వీట్ కు జోడిస్తూ ఢిల్లీ నెటిజన్లు రీట్వీట్ చేస్తున్నారు. ఢిల్లీ మెట్రో రైల్ తో పాటు మెట్రో స్టేషన్ ఆవరణలను కొందరు తమ టాలెంట్ ను ప్రదర్శించే వేదికలుగా భావిస్తున్నారంటూ కొంతమంది కామెంట్ చేశారు. ఇలాంటి వాటిని గట్టిగా నిరోధించాలని, డ్యాన్సులు, రీల్స్ వీడియోలు తీయకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నారు. ఈ రూల్స్ ఉల్లంఘించిన వారికి భారీ మొత్తంలో జరిమానా విధించాలని సూచిస్తున్నారు.
మెట్రోలో ప్రయాణిస్తున్నపుడు కొంతమంది ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుండా తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు చూస్తున్నారని, ఆ శబ్దాలతో తాము ఇబ్బంది పడుతున్నామని మరికొంతమంది ప్రయాణికులు ట్విట్టర్ లో వాపోయారు. కొన్నిసార్లు అభ్యంతరకరమైన వీడియోలను కూడా ఇలా పబ్లిక్ గా చూస్తున్నారని, ఆ ఆడియో వినలేకపోతున్నామని చెప్పారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.