Virat Kohli: కోహ్లీ సహా ఆర్సీబీ జట్టు సభ్యులందరికీ ఫైన్
- రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేటు
- సమయానికి ఓవర్లను పూర్తి చేయలేకపోయిన ఆర్సీబీ
- ఈ సీజన్ లో ఆర్సీబీ వైపు ఇది రెండో వైఫల్యం
- కోహ్లీకి రూ.24 లక్షలు.. మిగిలిన సభ్యులకు రూ.6 లక్షలు
ఐపీఎల్ 2023 సీజన్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై రెండోసారి జరిమానా పడింది. అంతేకాదు, ఆర్సీబీ జట్టు సభ్యులందరికీ మ్యాచ్ రిఫరీ ఫైన్ విధించారు. ఈ నెల 23న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించాడు. నిర్ణీత సమయానికి ఓవర్లు పూర్తి చేయడంలో ఆర్సీబీ విఫలమైంది. పైగా ఈ సీజన్ లో స్లో ఓవర్ రేటు ఇది రెండో సారి. దీంతో ఆర్సీబీపై మ్యాచ్ రిఫరీ చర్యలు ప్రకటించారు.
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందున ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి రూ.24 లక్షల జరిమానా విధిస్తున్నట్టు మ్యాచ్ రిఫరీ ప్రకటించారు. అలాగే, కోహ్లీతోపాటు ఈ నెల 23న ఆర్సీబీ తుది జట్టులోని అందరు ఆటగాళ్లు (ఇంపాక్ట్ ప్లేయర్ సహా) ఒక్కొక్కరికి రూ.6 లక్షల జరిమానా లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం (ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అది) చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. స్లో ఓవర్ రేటు కారణంగా మ్యాచ్ చివరి ఓవర్లో 30 యార్డ్ సర్కిల్ బయట కేవలం నలుగురు ఫీల్డర్లనే మోహరించేందుకు అనుమతించారు. నాటి మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచింది. ఏప్రిల్ 10న లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ ఆర్సీబీపై ఫైన్ పడింది. నాడు కెప్టెన్ గా వ్యవహరించిన డూప్లెసిస్ పై రూ.12 లక్షల జరిమానా విధించారు.