YS Vijayamma: చంచల్ గూడ జైలు వద్ద వైఎస్ విజయమ్మ
- పోలీసులపై చేయి చేసుకున్న కేసులో షర్మిలకు జ్యుడీషియల్ రిమాండ్
- జైల్లో ఉన్న కూతురును కలిసిన విజయమ్మ
- కోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన షర్మిల
పోలీసులపై దాడి చేసిన కేసులో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఆమెను హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు తన కుమార్తెను పరామర్శించేందుకు చంచల్ గూడ జైలుకు విజయమ్మ వెళ్లారు. ములాఖత్ ద్వారా షర్మిలతో ఆమె మాట్లాడారు.
నిన్న తన నివాసం నుంచి సిట్ కార్యాలయానికి షర్మిల వెళ్తున్న సమయంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. సిట్ కార్యాలయానికి వెళ్లడానికి అనుమతి లేదని ఆమెకు పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో పోలీసులకు, షర్మిలకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఎస్సై, మహిళా కానిస్టేబుల్ పై షర్మిల చేయిచేసుకున్నారు. దీంతో, ఆమెపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు షర్మిల కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.