Gutha Sukender Reddy: ఈ నాలుగు నెలలు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎంతో కష్టపడాలి: గుత్తా సుఖేందర్ రెడ్డి
- కేసీఆర్ మరోసారి సీఎం కావడం ఖాయమన్న గుత్తా
- రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అడ్డంకిగా మారిందని విమర్శ
- కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని వ్యాఖ్య
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ మరోసారి తెలంగాణ సీఎం కావడం ఖాయమని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అడ్డంకిగా మారిందని విమర్శించారు. మతతత్వ పార్టీలను తెలంగాణ ప్రజలు విశ్వసించరని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు ఆగడం లేదని... నేనే సీఎం అంటూ డజన్ల మంది కొట్టుకుచస్తున్నారని తెలిపారు. పార్టీ బాగుంటేనే మనందరం బాగుంటామని... ఈ నాలుగు నెలలు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు శ్రమించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో మిర్యాలగూడలో సీపీఎం పోటీ చేస్తోందనే ప్రచారంలో నిజం లేదని చెప్పారు.