YS Vijayamma: షర్మిల ఇలాంటి వాటికి భయపడే మనిషి కాదమ్మా!: విజయమ్మ

Vijayamma says her daughter Sharmila is very daring and dashing

  • నిన్న హైదరాబాదులో ఉద్రిక్త ఘటనలు
  • పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన షర్మిల
  • షర్మిలకు 14 రోజుల రిమాండ్
  • కుమార్తెను చంచల్ గూడ జైలులో కలిసిన విజయమ్మ
  • షర్మిల ప్రజల కోసం పోరాడుతుంటే జైలు పాలుచేశారని ఆగ్రహం

పోలీసులపై దాడి కేసులో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడం తెలిసిందే. ఇవాళ షర్మిలను ఆమె తల్లి వైఎస్ విజయమ్మ చంచల్ గూడ జైలులో ములాఖత్ ద్వారా కలిశారు. ఈ సందర్భంగా విజయమ్మ మీడియాతో మాట్లాడారు. షర్మిల ఇలాంటి వాటికి భయపడే మనిషి కాదమ్మా అంటూ వ్యాఖ్యానించారు. షర్మిల ప్రజల కోసం పోరాడేందుకు వచ్చిందని స్పష్టం చేశారు. 

"ఒక ఆడపిల్ల 3,800 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. అందుకే ఆమె నోరు నొక్కేసి జైలులో పెట్టారు. ఇంకో ఒకటిన్నర రోజులో పాదయాత్ర అయిపోతుంది... అలాంటి వేళ ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇలా చేయడం ఇది ఐదోసారి అనుకుంటా. షర్మిలకు ఇంట్లోంచి బయటికి వెళ్లే స్వేచ్ఛ కూడా లేదా? నిన్న గట్టిగా పది మంది కూడా లేరు... కానీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. 

సిట్ వద్దకు వెళ్లి ఆమె ప్రశ్నిస్తే ఏమవుతుంది... ఆమె క్రిమినలా? టెర్రరిస్టా? ఉద్యమకారిణా? వేలమందిని వెంటేసుకుని వెళుతోందా? కాదు కదా. షర్మిల ప్రజల కోసం నిలబడిన మనిషి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టాలని ఆరాటపడుతోంది. ఇవాళ నిరుద్యోగుల అంశం ఉద్యమ రూపు దాల్చిందంటే అందుకు కారణం షర్మిలే. ఎన్నో నిరాహార దీక్షలు చేసి ఈ అంశాన్ని నడిపించిందే ఆమె. 

కాంగ్రెస్ కార్యక్రమాలకు, బీజేపీ కార్యక్రమాలకు మాత్రం అనుమతిస్తున్నారు... కానీ షర్మిలమ్మను మాత్రం ఇల్లు కదలనివ్వడంలేదు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు... ఎవరి కోసమైతే షర్మిల పోరాడుతోందో వారు కూడా గమనిస్తున్నారు. ఈ సమయంలో సంయమనం పాటించమని వైఎస్సార్టీపీ చెబుతోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం, పోలీసులు గుర్తించాలి" అని విజయమ్మ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News