Jagan: సూడాన్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడేందుకు సీఎం జగన్ చర్యలు

CM Jagan directs officials to safe return of Telugu people from Sudan

  • సూడాన్ లో అంతర్యుద్ధం
  • ఆర్మీ, పారా మిలిటరీ మధ్య ఘర్షణలు
  • దేశంలో అరాచక పరిస్థితులు
  • భారతీయులను తరలిస్తున్న కేంద్రం
  • తెలుగు వారిని వెనక్కి రప్పించడంపై అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం

ఆఫ్రికా దేశం సూడాన్ లో ఆర్మీ, శక్తిమంతమైన పారా మిలిటరీ దళాల మధ్య ఘర్షణలు జరుగుతుండడంతో, సాధారణ పౌరులు బలవుతున్నారు. ఈ నేపథ్యంలో, సూడాన్ లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఏపీ సీఎం జగన్ కూడా సూడాన్ సంక్షోభంపై స్పందించారు. 

అంతర్యుద్ధం కారణంగా సూడాన్ లో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వారిని క్షేమంగా వెనక్కి రప్పించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. స్వదేశానికి రాగానే వారిని స్వస్థలాలకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

ఉక్రెయిన్ సంక్షోభం సమయంలో వ్యవహరించిన విధంగానే... సూడాన్ నుంచి తిరిగొచ్చే వారి కోసం విమాన టికెట్లు, ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విమానాశ్రయంలో వారిని రిసీవ్ చేసుకుని, అక్కడ్నించి వారు తమ స్వస్థలాలకు చేరుకునే వరకు అధికారులు అండగా నిలవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. 

కాగా, సూడాన్ లో 56 మంది వరకు తెలుగువారు ఉన్నట్టు భావిస్తున్నామని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు.

  • Loading...

More Telugu News