London: బ్రిటన్లో తొలి జగన్నాథ ఆలయం... రూ.250 కోట్ల విరాళం ఇచ్చిన ఎన్నారై
- లండన్ శివారులో నిర్మించే ఆలయానికి బిశ్వనాథ్ భూరి విరాళం
- ఆలయ నిర్మాణ పనులకు ఆహ్వానించిన క్రమంలో ప్రకటన
- పదిహేను ఎకరాల్లో... 2024 నాటికి ఆలయం పూర్తి
బ్రిటన్ లో మొట్టమొదటి జగన్నాథస్వామి ఆలయ నిర్మాణం కోసం ఒడిశాకు చెందిన ప్రవాస భారతీయుడు రూ.250 కోట్ల మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. యూకేలో స్థిరపడిన బిశ్వనాథ్ పట్నాయక్ లండన్ శివారులో జగన్నాథ స్వామి ఆలయ నిర్మాణం కోసం భారీ మొత్తంలో విరాళం ఇచ్చారు. బిశ్వనాథ్ ఫిన్ నెస్ట్ సంస్థ వ్యవస్థాపక చైర్మన్.
ఈ ఆలయ నిర్మాణం కోసం స్థానికులు శ్రీ జగన్నాథ సొసైటీ యూకేగా ఏర్పడ్డారు. దేశవ్యాప్తంగా ప్రజల నుండి విరాళాలు సేకరిస్తున్నారు. ఇటీవల అక్షయ తృతీయ రోజున ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బిశ్వనాథ్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా అతను భారీ విరాళం ప్రకటించారు.
2024 నాటికి ఈ ఆలయం పూర్తవుతుంది. ఈ జగన్నాథ దేవాలయాన్ని లండన్ శివారులో పదిహేను ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించి లోకల్ కౌన్సిల్ లో దేవాలయానికి సంబంధించిన ప్రీప్లానింగ్ అప్లికేషన్ ను సమర్పించారు.