Chandrababu: రిపబ్లిక్ టీవీ సదస్సులో చంద్రబాబు... తన అనుభవాన్నంతా మాటల్లో చూపించిన టీడీపీ అధినేత
- విజన్ 2047పై చంద్రబాబు అభిప్రాయాలు
- భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్న చంద్రబాబు
- ఉత్తమ ప్రభుత్వ పాలసీతో 25 ఏళ్లలో పేదరికం లేని సమాజం ఏర్పడుతుందని వెల్లడి
- డిజిటల్ కరెన్సీ ద్వారా రాజకీయ అవినీతికి చెక్ పెట్టొచ్చని వ్యాఖ్యలు
జాతీయ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ రిపబ్లిక్ టీవీ నిర్వహించిన టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్: ద నీడ్ టు కీప్ ఫైటింగ్ (Time of Transformation: The need to keep fighting) సదస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వివిధ అంశాలపై తన అనుభవాలు, అభిప్రాయాలు పంచుకున్నారు.
ఈ సదస్సులో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ...
2. ప్రస్తుతం టెక్నాలజీ పరంగా ఉన్నత దశలో ఉన్నాం. సాంకేతికత విప్లవాన్ని తెస్తుందని మొదటి నుంచి నేను చెపుతూ వస్తున్నాను. నాలెడ్జ్ ఎకానమీ అనేది ఆర్థిక వ్యవస్థకు దన్నుగా మారుతుంది.
3. సాంకేతిక విప్లవానికి హైదరాబాద్ ప్రస్థానమే నిదర్శనం. నేడు తెలంగాణ దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం పొందుతోంది. మైక్రోసాఫ్ట్ తీసుకురావడానికి నాడు నేను మన బలాలు ఏంటో బిల్ గేట్స్ కు వివరించాను. భారతీయులు గణితంలో, ఇంగ్లీషులో ప్రావీణ్యం కలిగిన వారు అని వివరించాను. దీంతో బిల్ గేట్స్ అంగీకరించి హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ ను ఏర్పాటు చేశారు.
4. 2047 నాటికి భారతదేశాన్ని నంబర్ వన్ లేదా నంబర్ టూ ఆర్థిక వ్యవస్థగా మార్చవచ్చు. మనం ఆ స్థాయికి చేరాలి అనేది నా కోరిక.
5. నాడు నేను విజన్ గురించి మాట్లాడితే నన్ను విమర్శించారు. కానీ విజన్ 2020 హైదరాబాద్‌లో సాకారం అయింది. సమాజం కోసం ముందుచూపుతో పనిచేసే నాయకులు ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటారు. గతంలో ప్రతిపక్షాలు నన్ను విమర్శించేవి.
6. ఇప్పుడు కూడా నేను విజన్ గురించి మాట్లాడుతుంటే విమర్శలు వస్తున్నాయి. సమాజంలో రాజకీయం కోణం వేరు... అభివృద్ధి వేరు అని నమ్ముతాను. దేశం, సమాజం శాశ్వతం, భారతదేశాన్ని నంబర్ వన్ చేయడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి. రాజకీయ పార్టీలు వేరు అయినా దేశానికే మొదటి ప్రాధాన్యత అని నేను భావిస్తాను.
7. పెద్ద నోట్లు రద్దు ద్వారా ఎన్నికల్లో డబ్బు పంపిణీ నివారించవచ్చు. రాజకీయాలలో పారదర్శకత వస్తుంది... రాజకీయ అవినీతిని నియంత్రిస్తే అది దేశానికి ఎంతో మేలు చేస్తుంది.
8. భారతదేశంలో 30% మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. PPPP విధానం ద్వారా ( పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్‌షిప్) మోడల్ తో ప్రతి కుటుంబానికి స్వల్పకాలిక, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేయాలి. తద్వారా ప్రతి కుటుంబంలో మార్పు తీసుకుని రావచ్చు.
9. సంపదను పంపిణీ చేయడానికి, సంక్షేమాన్ని అందించడానికి సంపద సృష్టి అవసరమని నేను నమ్ముతాను. స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ద్వారా పేదరిక నిర్మూలన అనేది సాధ్యం అవుతుంది. దాని కోసం ప్రత్యేక ప్రణాళికలను ప్రభుత్వాలు అమలు చేయాల్సి ఉంది.
10. మన నీటి వనరులను సమర్థంగా వినియోగించడం ద్వారా, వ్యవసాయానికి సాంకేతికత అందించడం ద్వారా సాగులో, రైతుల జీవితాల్లో మార్పులు తీసుకురావచ్చు. రైతుల ఆకాంక్షలను సాకారం చేయడానికి నదుల అనుసంధానం, జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ (ZBNF) వంటి వాటిపై దృష్టిపెట్టాల్సి ఉంది.
11. మన మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్ల కారణంగా పౌల్ట్రీ, ఆక్వాకల్చర్, హార్టికల్చర్ మొదలైన వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించడం ద్వారా రైతాంగానికి మేలు చేయవచ్చు.
12. దేశంలో సరైన విధానాలు రూపొందించడం, అమలు చేయడం ద్వారా అమెరికా, చైనాలను దాటి ఇండియా ప్రపంచ నెంబర్ 1 దేశం అవుతుంది. అతిపెద్ద ఎకానమీ అయ్యే అవకాశం ఉంది.
13. 2047 నాటికి భారతదేశం దారిద్య్ర రేఖకు ఎగువకు రావాలి అనేది నా ఆకాంక్ష. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన జాతిగా భారతీయులు వెలగాలి. దీనికి అన్ని అర్హతలు, అవకాశాలు మనకు ఉన్నాయి. అందుకు అనుగుణంగా ప్రయాణం సాగించాల్సి ఉంది.