Hyderabad: హైదరాబాద్‌లో రెండుగంటలపాటు కుమ్మేసిన వాన.. రికార్డుస్థాయి వర్షపాతం నమోదు
- నగరంలో రెండుగంటలపాటు కుండపోత
- 2015 తర్వాత తొలిసారి ఒక రోజులో అత్యధిక వర్షపాతం
- విరిగిన చెట్ల కొమ్మలు, విద్యుత్ తీగలపై పడిన హోర్డింగులు
- రహ్మత్‌నగర్ డివిజన్లోని ఓంనగర్‌లో ఇంటి గోడ కూలి 8 నెలల చిన్నారి మృత్యువాత
తెలంగాణ వ్యాప్తంగా నిన్న పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. కొన్ని చోట్ల వడగళ్లు కూడా పడ్డాయి. ఇక, హైదరాబాద్‌లో రెండు గంటలపాటు వర్షం కుమ్మేసింది. రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. రెండు గంటల్లోనే ఏకంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వేసవి మధ్యలో ఇలా కుండపోత వాన కురవడం ఇదే తొలిసారని వాతావరణశాఖ పేర్కొంది. 12 ఏప్రిల్ 2015లో అత్యధికంగా 6.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అంతకుమించిన వర్షపాతం నమోదైంది. ఓ వైపు భారీ వర్షంతోపాటు మరోవైపు, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో నగర వాసులు భయభ్రాంతులకు గురయ్యారు.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. హోర్డింగులు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా రహ్మత్‌నగర్ డివిజన్లోని ఎస్పీఆర్హిల్స్ ఓంనగర్ కూడలిలో గోడకూలి 8 నెలల చిన్నారి జీవనిక మృతి చెందింది.