Afghanistan: కాబూల్ విమానాశ్రయంపై దాడి సూత్రధారిని మట్టుబెట్టిన తాలిబన్లు
- ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాలు తరలిపోయిన తర్వాత తాలిబన్ల హస్తగతం
- దేశం నుంచి తరలిపోయిన వేలాదిమంది ఆఫ్ఘన్లు
- తరలింపు ప్రక్రియను చేపట్టిన అమెరికా బలగాలు
- అదే సమయంలో కాబూల్ విమానాశ్రయంలో పేలుడు
- 13 మంది అమెరికా సైనికులు సహా మరెంతోమంది దుర్మరణం
2021 కాబూల్ విమానాశ్రయంపై జరిగిన ఆత్మాహుతి దాడి సూత్రధారి అయిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని తాలిబన్లు హతమార్చారు. నాటి దాడిలో 13 మంది అమెరికా సైనికులు సహా మరెంతోమంది పౌరులు మరణించారు. 26 ఆగస్టు 2021న ఈ ఘటన జరిగింది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాలు తరలిపోయిన తర్వాత ఆ దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు.
తాలిబన్ల గత పాలనలో నరకం అనుభవించిన ఆఫ్ఘన్లు మళ్లీ అలాంటి పరిస్థితి వస్తుందేమోనన్న భయంతో దేశం నుంచి పెద్ద ఎత్తున తరలిపోయేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆ దేశంలో చిక్కుకున్న తమ పౌరులు, ఆఫ్ఘాన్ పౌరుల కోసం అమెరికా బలగాలు తరలింపు ప్రక్రియను ప్రారంభించాయి. అది కొనసాగుతున్న సమయంలో 26 ఆగస్టు 2021న కాబూల్ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడి జరిగింది.
‘అబేగేట్’ లాంటి ఆపరేషన్‌కు కుట్ర పన్నిన ఐఎస్ఐఎస్-కె అధికారి ఈ దాడి పథక రచనలో నేరుగా పాల్గొన్నాడు. ఇప్పుడతడు ఇక ఎలాంటి పథకాలు రచించలేడని, దాడులు చేయలేడని అమెరికా శ్వేతసౌధం అధికార ప్రతినిధి జాన్ కిర్బీ పేర్కొన్నారు. కాబూల్ విమానాశ్రయంలోని అబేగేట్ ప్రవేశ ద్వారం వద్దే ఈ పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలోనే ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆ అధికారి పేరును మాత్రం కిర్బీ వెల్లడించలేదు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ఘనిస్థాన్ అనుబంధ సంస్థను ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ లేదంటే ఐఎస్ఐఎస్-కెగా వ్యవహరిస్తారు. ఇది తాలిబన్లకు బద్ధ శత్రువు.