watermelon: డయాబెటిస్ ఉన్న వారు పుచ్చకాయ తినొచ్చా..?
- పుచ్చకాయలో గ్లైసిమిక్ ఇండెక్స్ కొంచెం ఎక్కువే
- అయినా 92 శాతం నీరు, మిగిలినది ఫైబర్
- విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ, కేలరీలు తక్కువ
- మోస్తరుగా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు
వేసవిలో ఎక్కువ మంది ఇష్టంగా తినే పండ్లలో పుచ్చకాయ కూడా (వాటర్ మెలాన్) ఒకటి. రుచితో పాటు అధిక శాతం నీరు ఉండే పుచ్చకాయ పోషకాల నిలయం. పుచ్చకాయలో సహజ చక్కెర పరిమాణం అధికంగా ఉంటుంది. దీంతో దీన్ని డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు తినొచ్చా? అన్న సందేహం వస్తుంటుంది. దీనికి నిపుణులు పరిమితంగా తినొచ్చని సూచిస్తున్నారు.
వాటర్ మెలాన్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్ ఏ, సీ, ఫైబర్ ఉండడం అనుకూలం. లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా లభిస్తుంది. ఇది కేన్సర్, గుండె జబ్బుల నుంచి రక్షణనిచ్చే యాంటీ ఆక్సిడెంట్. పుచ్చకాయలో 92 శాతం నీరే ఉంటుంది. మిగిలినది ఫైబర్. కనుక పండ్లలో ఇదొక మంచి ఎంపిక అవుతుంది. అధిక నీటి పరిమాణం వల్ల వేసవిలో శరీరంలో తగినంత నీటి పరిమాణం ఉండేందుకు ఈ పండు అనుకూలిస్తుంది. ఇందులో ఫొలేట్, పొటాషియం, ఫైటో కెమికల్స్, మినరల్స్ కూడా ఉంటాయి.
వాటర్ మెలాన్ గ్లైసిమిక్ ఇండెక్స్ 72. ప్రతీ పదార్థానికీ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే తిన్న తర్వాత ఎంత వేగంగా గ్లూకోజ్ గా మారిపోతుందన్నది ఈ ఇండెక్స్ చెబుతుంది. జీఐ 72 అంటే మోస్తరు నుంచి అధికం అని అర్థం. మధుమేహులు జీఐ తక్కువగా ఉన్నవి తీసుకుంటే మంచిది. మరి పుచ్చకాయలో జీఐ కొంచెం ఎక్కువగా ఉన్నందున తీసుకోవచ్చా? అన్న సందేహం తప్పకుండా వస్తుంది. కాకపోతే పుచ్చకాయలో 92 శాతం నీరు, మిగిలినది ఫైబర్ అవ్వడం వల్ల, తిన్న వెంటనే అది గ్లూకోజ్ గా మారిపోదు. ఫైబర్ ఉండడం వల్ల నిదానంగానే రక్తంలోకి విడుదల అవుతుంది. అందుకని పరిమితంగా తీసుకోవడం మధుమేహులకూ మంచిదే.