MG Comet: తక్కువ ధరకే విడుదలైన చిన్న ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్
- ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.98 లక్షలు
- టాటా టియాగో రూ.9.05 లక్షల కంటే తక్కువ
- రెండు డోర్లు, నాలుగు సీట్లతో ఉండే చిన్న కారు
ఎంజీ మోటార్ ఇండియా దేశంలోనే చిన్న ఎలక్ట్రిక్ కారు ‘ఎంజీ కామెట్ ఈవీ’ని నేడు (బుధవారం) విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) ధర రూ.7.98 లక్షలు. ఇప్పటి వరకు టాటా టియాగో ఈవీ రూ.9.05 లక్షలతో తక్కువ ధర ఎలక్ట్రిక్ కారుగా చలామణిలో ఉంది. ఇప్పుడు దీని కంటే తక్కువ ధరకే ఎంజీ కామెట్ విడుదలైంది. ఎంజీ కామెట్ ను రెండు వేరియంట్లలో విడుదల చేశారు.
ఎంజీ మోటార్ నుంచి ఇది రెండో ఎలక్ట్రిక్ కారు. లోగడ జెడ్ ఎస్ ఈవీని ఈ సంస్థ భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. రెండు డోర్లు, నాలుగు సీట్లతో చిన్న పరిమాణంలో కామెట్ ఉంటుంది. పట్టణాల్లో రోజువారీ రవాణాకు అనుకూలమని ఎంజీ మోటార్ ఇండియా ప్రకటించింది. ఇది దేశంలోనే చిన్న ఈవీ. మూడు మీటర్ల పొడవు, 1640 మిల్లీమీటర్ల ఎత్తుతో ఉంటుంది. 12 అంగుళాల స్టీల్ వీల్స్ ను కంపెనీ ఏర్పాటు చేసింది.
17.3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కామెట్ లో ఉంటుంది. ఒక్క చార్జ్ తో 230 కిలోమీటర్లు ప్రయాణించగలదు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. మోటారు పవర్ 41 హెచ్ పీ కాగా, 110 ఎన్ ఎం టార్క్ తో ఉంటుంది. కారులో 10.25 అంగుళాలతో రెండు స్క్రీన్లు ఉంటాయి. ఒకటి పూర్తిగా వినోదం కోసం ఉద్దేశించినది. రెండోది డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే. కారులో డ్యాష్ బోర్డ్ ఉండదు. స్పేస్ ఆదా కోసం ఈ విధంగా డిజైన్ చేశారు. వైట్, బ్లాక్, సిల్వర్ రంగుల్లో ఈ కారు లభిస్తుంది.