UK people: బ్రిటన్ ప్రజలు పేదవారంటున్న ప్రముఖ ఆర్థిక వేత్త
- పేదవారమన్న విషయాన్ని ప్రజలు అంగీకరించాలని వ్యాఖ్య
- వాస్తవ వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచన
- అప్పుడే ద్రవ్యోల్బణం దిగొస్తుందన్న అభిప్రాయం
బ్రిటన్ వాసులు పేదవారేంటి? అది అభివృద్ధి చెందిన దేశం కదా? అన్న సందేహాలు రావచ్చు. బ్రిటన్ లో ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త హ్యూ పిల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యూకే వాసులు తాము పేదవారమన్న విషయాన్ని అంగీకరించాలని, లేదంటే ధరల పెరుగుదల ఆగదని ఆయన హెచ్చరించారు. ‘‘అయితే, తాము పేదలమని అంగీకరించేందుకు ప్రజలు ఇష్టపడరు’’ అని ఆయన అన్నారు.
బ్రిటన్ లో ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. ద్రవ్యోల్బణాన్ని 2 శాతం పరిధిలో కట్టడి చేయాలన్నది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ లక్ష్యం. కానీ, మార్చి నెలకు ద్రవ్యోల్బణం 10.1 శాతంగా నమోదైంది. పెరుగుతున్న ధరలను కట్టడి చేయడానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ రేట్లను పెంచుతోంది. ధరలకు బ్రేక్ పడకపోతే ఇక ముందూ పెంచాల్సి వస్తుంది.
ఈ తరుణంలో పెరిగిపోతున్న ధరలు, వేతనాలు పెంచాలనే డిమాండ్ల నేపథ్యంలో పిల్ ఇలా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ధరల పెరుగుదలతో వినియోగం తగ్గి, అలా అయినా ద్రవ్యోల్బణం దిగొస్తుందని అంచనా. ప్రజల వినియోగాన్ని తగ్గించడంపై అక్కడ సెంట్రల్ బ్యాంక్ దృష్టి పెట్టింది. అయినా అక్కడ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ‘‘బ్రిటన్ లో ప్రజలు తాము అధ్వాన పరిస్థితుల్లో ఉన్నామని అంగీకరించాలి. తమ వాస్తవ వినియోగ శక్తితో ధరలను పెంచడాన్ని ఆపివేయాలి’’ అని పిల్ సూచించారు.