Detergents: సబ్బులు, షాంపూల ధరలు పెరగనున్నాయా?
- శాచురేటెడ్ ఫ్యాటీ ఆల్కహాల్ పెద్ద ఎత్తున దిగుమతి
- షాంపూలు, సబ్బుల తయారీలో ఇది కీలక ముడి పదార్థం
- దీనిపై యాంటీ డంపింగ్ డ్యూటీ పెంచే ప్రతిపాదన
- అమల్లోకి వస్తే పెరిగిపోనున్న తయారీ ధర
సబ్బులు, షాంపూల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సబ్బులు, షాంపూల తయారీలో వినియోగించే కీలక ముడి పదార్థమైన ‘శాచురేటెడ్ ఫ్యాటీ ఆల్కహాల్’ పై యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వీలింగ్ డ్యూటీని పెంచే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రతిపాదనను ఇండియన్ సర్ఫాక్టెంట్ గ్రూపు డిమాండ్ చేస్తోంది.
ఇండోనేషియా, మలేషియా, థాయిల్యాండ్ దేశాల నుంచి శాచురేటెడ్ ఫ్యాటీ ఆల్కహాల్స్ (ఎస్ఎఫ్ఏ) మన దేశంలోకి పెద్ద మొత్తంలో దిగుమతి అవుతోంది. దీంతో అధిక యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వీలింగ్ డ్యూటీ విధించాలని రెండు నెలల క్రితం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ కేంద్రానికి సూచించింది. అలా చేస్తే దిగుమతి చేసుకునే శాచురేటెడ్ ఫ్యాటీ ఆల్కహాల్స్ ధరలు మరింత పెరుగుతాయి. దీంతో ఈ ముడి పదార్థం ఆధారంగా తయారు చేసే వాటి ధరలు కూడా పెంచాల్సి వస్తుంది. ఇప్పటికే మన దేశంలో ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్నందున, తాజా ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని పరిశ్రమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. దీనిపై అంతిమంగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.