YS Avinash Reddy: అవినాశ్ ను అరెస్ట్ చేస్తారు.. ఆ తర్వాత బెయిల్ పై విడుదల అవుతారు : ఎమ్మెల్యే రాచమల్లు
- అవినాశ్ హింసను ప్రేరేపించరనే విషయాన్ని నమ్ముతున్నానన్న రాచమల్లు
- నిందితుడిగా ఉన్నంత మాత్రాన నేరస్తుడు కాదని వ్యాఖ్య
- అవినాశ్ నేరస్తుడిగా రుజువైతేనే రాజీనామా చేస్తానని చెప్పానన్న ఎమ్మెల్యే
కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హింసకు వ్యతిరేకమని... ఆయన హింసను ప్రేరేపించరనే విషయాన్ని మనస్పూర్తిగా నమ్ముతున్నానని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. కేసులో నిందితుడుగా ఉన్నంత మాత్రాన నేరం చేసినట్టు కాదని చెప్పారు.
వివేకా హత్యలో అవినాశ్ రెడ్డి పాత్ర ఉందని రుజువైతే తాను రాజకీయాల్లో ఉండనని చెప్పానని... అవినాశ్ నేరస్తుడని తేలితే రాజీనామా చేస్తానని, తనతో పాటు మరో తొమ్మిది మంది రాజీనామా చేస్తారని చెప్పానని అన్నారు. నేరస్తుడిగా రుజువైతేనే రాజీనామా చేస్తానని, నిందితుడిగా ఉంటే కాదని స్పష్టం చేశారు. వివేకా హత్య కేసులో అవినాశ్ ను అరెస్ట్ చేస్తారని.. అయితే ఆయన బెయిల్ పై బయటకు వస్తారని చెప్పారు.
ఈ కేసులో అవినాశ్ రెడ్డిని అనవసరంగా ఇరికించారని రాచమల్లు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర చేసి అవినాశ్ ను ఇరికించే ప్రయత్నం చేశారని చెప్పారు. ఈరోజు కడపలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే రాచమల్లుతో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. అవినాశ్ ను సీబీఐ అరెస్ట్ చేస్తే ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై నేతలు చర్చించారు. అనంతరం రాచమల్లు మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.