KTR: ఆందోళన చెందవద్దని రైతులకు మంత్రి కేటీఆర్ భరోసా
- రైతుల విషయంలో మేం సానుకూలమన్న మంత్రి కేటీఆర్
- రైతులు ధైర్యం కోల్పోవద్దని, కేసీఆర్ అండగా ఉన్నారని వ్యాఖ్య
- అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి
అకాల వర్షాల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా చాలాచోట్ల పంటపొలాలు నీట మునిగాయి. వడగళ్ల వానకు చెట్లు, కాయ నేల రాలింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆందోళన చెందవద్దని, రైతుల విషయంలో తమ ప్రభుత్వం అత్యంత సానుకూలంగా ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా ఇవ్వాలని కూడా సూచించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వలన రైతులకు ఎదురవుతున్న ఇబ్బందుల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులు అంతా క్షేత్రస్థాయిలో పర్యటించి స్ధానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు. ఈ మధ్యనే కురిసిన అకాల వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రైతులు ధైర్యం కోల్పోవద్దని, రైతులకు అండగా కేసీఆర్ ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. రానున్న ఒకటి, రెండు రోజులపాటు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని అధికారులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని కేటీఆర్ కోరారు.