Telangana: కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. ఏపీలో మరో వారం రోజులపాటు వర్షాలు

Rains expected for a week in Andhrapradesh

  • ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం
  • ద్రోణి ప్రభావంతో సముద్రం నుంచి తేమ గాలులు
  • నేడు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు
  • ఈ నెల 29 నుంచి కోస్తాపైకి ద్రోణి
  • మే 4 వరకు వర్షాలు కురిసే అవకాశం

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత రెండుమూడు రోజులుగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా నిన్నమొన్నటి వరకు ఎండలతో అల్లాడిపోయిన జనానికి కాస్తంత ఉపశమనం లభించింది. అయితే, అకాల వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 

ఇక, ఈ వర్షాలు ఇప్పట్లో ఆగేలా లేవు. ఆంధ్రప్రదేశ్‌లో మరో వారం రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటక వరకు ద్రోణి విస్తరించిందని, దీని ప్రభావంతో సముద్రం నుంచి తేమగాలులు వీస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఫలితంగా కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల నిన్న ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. నేడు కూడా కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అలాగే, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.

విదర్భ నుంచి కర్ణాటక వరకు విస్తరించిన ద్రోణి తూర్పు దిశకు పయనించే క్రమంలో రాష్ట్రంలో వర్షాలు మరింతగా కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 29 నుంచి ద్రోణి కోస్తాపైకి వస్తుందని, ఆ తర్వాత నుంచి వర్షాలు కురుస్తాయన్నారు. ఫలితంగా వాతావరణం చల్లబడుతుందన్నారు. ఈ నెల 30 నుంచి మే 3, 4వ తేదీల వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు గాలి తీవ్రత పెరుగుతుందని వివరించారు. అలాగే, ఈదురు గాలుల ప్రభావం కూడా ఉంటుందని, కాబట్టి పంటల విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News