Karnataka: కర్ణాటక ఎన్నికలు: హోం మంత్రి అమిత్ షాపై పోలీసులకు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
- బెంగళూరు పోలీస్ స్టేషన్‌లో హోం మంత్రిపై కాంగ్రెస్ నేతలు రణదీప్ సుర్జీవాలా, డీకే శివకుమార్ ఫిర్యాదు
- మతసామరస్యం చెడగొట్టేలా అమిత్ షా వ్యాఖ్యానించారని కేసు
- తప్పుడు ఆరోపణలతో ప్రతిపక్షాన్ని అప్రతిష్ఠ పాలు చేశారని ఆరోపణ
కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు రణదీప్ సుర్జేవాలా, డా. పరమేశ్వర్, డీకే శివకుమార్ తాజాగా కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా షా తప్పుడు వ్యాఖ్యలు చేశారని, ప్రతిపక్ష పార్టీని అప్రతిష్ఠ పాలు చేసేందుకు ప్రయత్నించారంటూ అమిత్ షాపై బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు.
అనంతరం, సుర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ, ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతాయని అమిత్ షా అన్నారు. అంతేకాదు, పీఎఫ్ఐ సంస్థపై నిషేధం ఎత్తేస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని కూడా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు చేయడమంటే రాష్ట్రంలో మతసామరస్యాన్ని చెగడొట్టడమే, కాంగ్రెస్‌కు దురుద్దేశాలు ఆపాదించడమే’’ అని సుర్జేవాలా వ్యాఖ్యానించారు.
మంగళవారం బాగాల్‌కోట్‌లో జరిగిన ఓ ర్యాలీలో అమిత్ షా ప్రతిపక్షంపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ‘‘కాంగ్రెస్‌కు పొరపాటున ఓటు వేసినా, రాష్ట్రంలో అవినీతి మునుపెన్నడూ చూడని స్థాయికి చేరుకుంటుంది. వారసత్వ రాజకీయాలు, ఆశ్రితపక్షపాతం పెచ్చరిల్లుతాయి. అల్లర్లు చెలరేగి యావత్ రాష్ట్రం అవస్థల పాలవుతుంది’’ అని షా మండిపడ్డారు.