Amazon Prime: తగ్గేదేలే అంటున్న అమెజాన్.. మరోసారి ప్రైమ్ ధరల పెంపు
- నెలవారీ రీచార్జ్ చేసుకోవాలంటే రూ.299 పెట్టాల్సిందే
- రూ.599కు పెరిగిన మూడు నెలల రీచార్జ్
- ఏడాది ప్లాన్ లో ఎలాంటి మార్పుల్లేవు.. రూ.1,499
జియో టెలికం మార్కెట్లోకి ఎలా చొచ్చుకుపోయిందో గుర్తు తెచ్చుకోండి. డేటా, కాల్స్ అన్ లిమిటెడ్ గా ఉచితం. ఫ్రీగా సిమ్ తీసుకుని వాడుకోండి. ఈ విధమైన ఆఫర్లతో యూజర్లను సొంతం చేసుకుంది జియో. అలా ఏడాది పాటు అన్నీ ఉచితంగా ఇచ్చిన సంస్థ నెలవారీ చేసుకోవాల్సిన రీచార్జ్ ప్లాన్లను ప్రకటించింది. ఆ తర్వాత నుంచి క్రమంగా వీటిని పెంచుతూ పోతోంది. ఇప్పుడు ఒక నెలకు కనీసం రూ.200 పెట్టుకుంటేనే సేవలు.
అమెజాన్ ప్రైమ్ కూడా ఇదే బాటలో నడుస్తోంది. మొదట్లో అమెజాన్ ప్రైమ్ వార్షిక ప్లాన్ ధర కేవలం రూ.500. కానీ, ఆ తర్వాత రూ.999 చేసింది. ఆ తర్వాత ఇది కాస్తా రూ.1,499 కు చేరింది. ఇప్పుడు నెలవారీ అమెజాన్ ప్రైమ్ కోరుకునే వారు రూ.299 పెట్టి రీచార్జ్ చేసుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఇది రూ.179 గానే ఉంది. అంటే దాదాపు 80 శాతానికి పైనే పెంచింది. మూడు నెలలకు ఉన్న రూ.459 కాస్తా రూ.599కు చేరిపోయింది. కాస్త ఉపశమనం ఏమిటంటే వార్షిక ప్లాన్ ఇప్పటి వరకు రూ.1,499గా ఉంటే, దీనిలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీర్ఘకాల రీచార్జ్ లను పెంచుకునే వ్యూహంతో నెలవారీ, మూడు నెలల ప్లాన్లలో మార్పులు చేసినట్టు కనిపిస్తోంది. అమెజాన్ ప్రైమ్ లైట్ వార్షిక ధర రూ.999.