Hair Fall: రోజువారీ ఇవి అందేలా చూసుకుంటే.. జుట్టు రాలడాన్ని నివారించవచ్చు!

Add These Nutrients To Your Diet To Reduce Hair Fall

  • శిరోజాలకు పోషకాల అవసరం ఎంతో
  • బయోటిన్, విటమిన్ ఈ, సీ, ఏ అందేలా చూసుకోవాలి
  • ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తోనూ ప్రయోజనం

శిరోజాలు రాలిపోవడం వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి. పోషకాలు లోపించొచ్చు. లేదంటే ఒత్తిడి, ఆందోళన కారణం కావచ్చు. హార్మోన్లలో మార్పులతోనూ శిరోజాలు రాలిపోయే సమస్య ఎదురవుతుంది. అయితే కారణాన్ని గుర్తిస్తే ఈ సమస్యను సులభంగానే నయం చేసుకోవచ్చు. నివారించలేని సమస్య ఇది కానే కాదు. ముఖ్యంగా శిరోజాలకు బలాన్నిచ్చే ముఖ్యమైన పోషకాలు కొన్ని ఉన్నాయి. వీటిని రోజువారీ ఆహారం రూపంలో అందేలా చూసుకోవాలి.

బయోటిన్
ఇది బీ 7 విటమిన్. ఇది లోపించడం వల్ల శిరోజాలకు బలం తగ్గుతుంది. బయోటిన్ లోపించినప్పుడు జుట్టు కుదుళ్లకు సరిపడా ఆక్సిజన్ సరఫరా కాదు. దీంతో జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి. దాంతో జుట్టు రాలుతుంది. 18 ఏళ్లు నిండిన వారు ప్రతి రోజూ 30 ఎంసీజీ నుంచి 100 ఎంసీజీ వరకు బయోటిన్ అందేలా చూసుకోవాలి. బయోటిన్ కొంచెం ఎక్కువైనా మూత్రం ద్వారా విసర్జితం అవుతుంది.

విటమిన్ ఏ
సాధారణంగా విటమిన్ ఏ అంటే కంటి ఆరోగ్యానికే అనుకుంటుంటాం. కానీ, ఇది శిరోజాల ఎదుగుదలకూ ముఖ్యమే. విటమిన్ ఏ ఎక్కువైనా ప్రమాదమే. అందుకని రోజులో 900 ఎంసీజీ పరిమాణం మించకుండా విటమిమన్ ఏ తీసుకోవచ్చు. ఎక్కువ తీసుకుంటే అదనపు మొత్తాన్ని మన శరీరం మూత్రం ద్వారా బయటకు పంపలేదు. శరీరంలోనే నిల్వ చేసుకుంటుంది. కనుక మోతాదు మించకూడదు.

ఐరన్
మన శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ ను ఎర్ర రక్త కణాలు చేరవేస్తాయి. అప్పుడు జీవక్రియలు సాఫీగా నడుస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ ఐరన్ లోపం లేకుండా చూసుకోవాలి. ఐరన్ లోపిస్తే జుట్టు కూడా రాలిపోతుంది. రోజులో పెద్దవారు గరిష్టంగా 45 ఎంజీ మించకుండా ఐరన్ అందేలా చూసుకోవాలి.

ఒమెగా 3
ఇవి మంచి కొవ్వులు. జుట్టు ఎదిగేందుకు సైతం ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగపడుతాయి. జుట్టు రాలిపోతున్న వారికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, 6 యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లను ఇచ్చి చూసినప్పుడు మంచి ఫలితాలు కనిపించాయి. 

విటమిన్ డీ
విటమిన్ డీ లోపం అలోపీసియాకు దారితీస్తుంది. అంటే మహిళల్లో బట్టతలను ఇలా చెబుతారు. వెంట్రుకలకు సంబంధించి కొత్త ఫాలికల్స్ ఏర్పడడంలో విటమిన్ డీ ప్రభావం ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. పెద్దలు రోజువారీ 600 ఐయూల మేరకు విటమిన్ డీ అందేలా చూసుకోవాలి.

విటమిన్ ఈ
విటమిన్ ఈ కూడా జుట్టు ఆరోగ్యంగా ఎదిగేందుకు అవసరం. ఇది లోపించినా జుట్టు రాలిపోవచ్చని పలు అధ్యయనాలు వెల్లడించాయి. రోజువారీగా 3-4 ఎంజీ మేర తీసుకోవచ్చు.

విటమిన్ సీ
వ్యాధి నిరోధక శక్తిని విటమిన్ సీ పెంచుతుంది. చర్మం, శిరోజాల ఆరోగ్యానికి కారణమయ్యే కొల్లాజెన్ ను పెంచుతుంది. రోజులో 50-75 ఎంజీ మధ్య విటమిన్ సీని ఆహారం ద్వారా అందేలా చూసుకోవాలి. పోషకాల లోపం లేకుండా జాగ్రత్త పడిన తర్వాత కూడా జుట్టు రాలే సమస్య తగ్గకపోతే.. అప్పుడు వైద్యుల సలహా అవసరపడుతుంది.

  • Loading...

More Telugu News