KCR: అవసరమైతే టీవీ చానల్ నడపండి: సీఎం కేసీఆర్
- హైదరాబాదులో బీఆర్ఎస్ ప్లీనరీ
- సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ జనరల్ బాడీ మీటింగ్
- రాబోయే ఎన్నికల నేపథ్యంలో శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం
- శ్రేణుల్లో అసంతృప్తి లేకుండా చూడాలని వెల్లడి
బీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని అభివృద్ధి పథంలో నిలపడమే తమ అజెండా అని స్పష్టం చేశారు. మెరుగైన పని తీరు కనబర్చిన వారికే ఈసారి ఎన్నికల్లో టికెట్లు అని వెల్లడించారు. పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి లేకుండా చూడాలని అన్నారు.
పార్టీ కోసం అవసరమైతే టీవీ చానల్ నడపాలని సీఎం కేసీఆర్ సూచించారు. బీఆర్ఎస్ ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి పార్టీ శ్రేణులే టీవీ ప్రకటనలు, ఫిల్మ్ ప్రొడక్షన్ చేపట్టవచ్చని వివరించారు. ప్రజలతో మాస్ కమ్యూనికేషన్ పెంచుకోవాలని, ప్రభుత్వ పథకాలను భారీ ఎత్తున ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు.
నిత్యం ప్రజల్లో ఉండడం అనేది చాలా ముఖ్యమని కేసీఆర్ పేర్కొన్నారు. దాహం వేసినప్పుడే బావి తవ్వుకుంటాం అనే ధోరణి ఇప్పటి కాలం రాజకీయాలకు సరిపోదని అన్నారు.