Chandrababu: మంత్రి అంబటికి చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్
- సత్తెనపల్లిలో ఓ యువకుడి మృతి
- పరిహారం చెక్కు అందలేదంటున్న తల్లిదండ్రులు
- వైసీపీ నేతలు వాటా అడుగుతున్నారని ఆరోపణ
- మృతుడి కుటుంబ సభ్యులతో చంద్రబాబు సెల్ఫీ
- చెక్కు ఎప్పుడిస్తారు అంబటి గారూ అంటూ ట్వీట్
పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన తురక పర్లయ్య, గంగమ్మ దంపతుల కుమారుడు అనిల్ ఓ హోటల్ లో పనికి వెళ్లి మృతి చెందాడు. ప్రభుత్వం రూ.5 లక్షల సాయం ప్రకటించగా, అందులో రూ.2.50 లక్షలు ఇవ్వాలని మున్సిపల్ చైర్ పర్సన్ భర్త అడుగుతున్నాడని గంగమ్మ, పర్ల దంపతులు మీడియా ముందుకు రావడం అప్పట్లో కలకలం రేపింది.
మంత్రి అంబటిని కలిస్తే, ఆ డబ్బు ఇవ్వాల్సిందేనని చెప్పారని, అతడు వద్దన్నా నేను తీసుకుంటానని అన్నాడని ఆ దంపతులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు.
రూ.5 లక్షల పరిహారంలో సగం కమీషన్ ఇవ్వలేదని తొక్కిపట్టిన చెక్కును బాధిత కుటుంబానికి ఎప్పుడు ఇస్తారు మంత్రి అంబటి గారూ? అంటూ ప్రశ్నించారు. ఆ చెక్ ఇప్పుడు ఎక్కడుంది? నిన్న నా సభకు రాకుండా బాధితులు తురక గంగమ్మ, పర్లయ్య కుటుంబాన్ని పోలీసులతో ఎందుకు నిర్బంధించారు? అని నిలదీశారు.
నా సెల్ఫీ చాలెంజ్ కు సమాధానం చెప్పగలరా? అంటూ చంద్రబాబు మంత్రి అంబటికి సవాల్ విసిరారు. ఆ మేరకు గంగమ్మ, పర్లయ్య కుటుంబంతో తాను దిగిన సెల్ఫీని చంద్రబాబు ట్విట్టర్ లో పంచుకున్నారు.