Karnataka: 6 రోజులు 22 ర్యాలీలు.. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి మోదీ రెడీ
- రేపటి నుంచి ఆరు రోజుల పాటు రాష్ట్రంలో మోదీ పర్యటన
- అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ
- మళ్లీ అధికారం నిలబెట్టుకునేందుకు వ్యూహ రచన
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అగ్రనాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దక్షిణాదిలో కీలకమైన కర్ణాటకలో గెలవడం ముఖ్యమని భావిస్తోంది. ఇప్పటికే హోం మంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్ర నాయకులు కర్ణాటకలో ప్రచారం ముమ్మరం చేశారు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా రంగలోకి దిగుతున్నారు.
రేపటి నుంచి ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆరు రోజుల్లో రాష్ట్రంలో 22 ర్యాలీల్లో పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచారానికి గడువు మే నెల 8వ తేదీ వరకు ఉంది. దీంతో హుమ్నాబాద్, విజయపుర, బెంగళూరు, కోలార్, చెన్నపట్న, బెలూర్ నియోజకవర్గాల్లో మోదీ రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించనున్నారు. కాగా, కర్ణాటకలో మే 10న పోలింగ్ జరగనుంది. అదే నెల 13న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.