Oral sex: ఓరల్ సెక్స్ విషయంలో జాగ్రత్త.. గొంతు కేన్సర్ రిస్క్!
- పాశ్చాత్య దేశాల్లో పెద్ద సంఖ్యలో గొంతు కేన్సర్ కేసులు
- అమెరికాలో 70 శాతం కేసుల్లో హెచ్ పీవీయే కారణం
- లైంగికంగా సంక్రమించే వైరస్ నోటిలోకి చేరడంతో కేన్సర్
గత రెండు దశాబ్దాల్లో గొంతు కేన్సర్ కేసులు పాశ్చాత్య దేశాల్లో గణనీయంగా పెరిగాయి. కొందరు నిపుణులు దీన్ని మహమ్మారిగానూ అభివర్ణించారు. ఓరో ఫారింజిల్ కేన్సర్ లేదా గొంతు కేన్సర్.. ఇది టాన్సిల్స్ వద్ద మొదలవుతుంది. ఇలా గొంతు కేన్సర్ కేసులు పెరిగిపోవడానికి ఓరల్ సెక్స్ (నోటితో చేసే శృంగారం) ప్రధాన కారణంగా ఉంటున్నట్టు తెలిసింది. హ్యుమన్ పాపిలోమా వైరస్ గురించి వినే ఉంటారు. దీన్నే హెచ్ పీవీ అంటారు. దీని కారణంగా మహిళలకు గర్భాశయ ముఖద్వార కేన్సర్ వస్తుంటుంది. దీని నివారణకు హెచ్ పీవీ వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
నోటితో శృంగారం సురక్షిత విధానం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొందరికి దీని గురించి తెలిసినా, చాలా మందికి దీని వల్ల ఏర్పడే సమస్యలపై అవగాహన ఉండడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. ఓరల్ సెక్స్ తో సుఖవ్యాధుల ముప్పు పెరుగుతుంది. కనుక దీనికి దూరంగా ఉండాలన్నది సూచన. మరీ ముఖ్యంగా శృంగారానికి ముందు భాగస్వాములు ఇద్దరూ వంటి శుభ్రత ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. నోటిలో ఏవైనా గాయాలు ఉంటే, అవి మానిపోయే వరకు నోటితో శృంగారం అస్సలు చేయకూడదని, ఈ విషయంలో నియంత్రణలు పాటించాలని సూచిస్తున్నారు.